nagidream
Full Story Of Nandyala Minor Girl: ఆడుకోడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. అంతే ఇక తిరిగి రాలేదు. ఆ బిడ్డ జీవితంతో మూడు మానవ మృగాలు మైనర్ ముసుగు వేసుకుని ఆడుకున్నాయి. 7వ తరగతి చదువుతున్న బాలురు.. 3వ తరగతి చదువుతున్న బాలికపై హత్యాచారం చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
Full Story Of Nandyala Minor Girl: ఆడుకోడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. అంతే ఇక తిరిగి రాలేదు. ఆ బిడ్డ జీవితంతో మూడు మానవ మృగాలు మైనర్ ముసుగు వేసుకుని ఆడుకున్నాయి. 7వ తరగతి చదువుతున్న బాలురు.. 3వ తరగతి చదువుతున్న బాలికపై హత్యాచారం చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
nagidream
తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుకోవాల్సిన వయసున్న స్కూల్ పిల్లలు.. అదే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మంచి సంఘటనలను ఆదర్శంగా తీసుకోవాల్సిన విద్యార్థులు.. అమ్మాయిల మీద అత్యాచారం చేసే సంఘటనలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అమ్మాయిలని అత్యాచారం చేసే మృగాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లలో అశ్లీల వీడియోల ప్రేరణతో చిన్న పిల్లలే తోటి చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలోని మూడో తరగతి చదువుతున్న బాలికను 7వ తరగతి చదువుతున్న బాలురు హత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో పగిడ్యాల మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఎల్లాల. ఈ నెల అనగా జూలై 7న ఆదివారం నాడు బాలిక.. ఆడుకోడానికి వెళ్తున్నా అమ్మ అంటూ ఇంట్లోంచి వెళ్ళింది. ముచ్చుమర్రిలో ఉన్న పార్క్ కి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్ళింది. అయితే మైనర్ ముసుగులో ఉన్న మానవ మృగాలు తన జీవితంతో ఆడుకుంటాయని తెలియక అటుగా వెళ్ళింది ఆ అభాగ్యురాలు. తనతో వచ్చిన స్నేహితులు వెళ్లిపోవడంతో పార్క్ లో బాలిక ఒక్కర్తే ఆడుకుంటుంది. ఒంటరిగా ఆడుకుంటున్న బాలికను ముగ్గురు బాలురు వచ్చి కాలువ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై ఇంట్లో చెప్తుందేమో అని గొంతు నులిమి ఆ బాలికను చంపేశారు.
ఆడుకోడానికని వెళ్లిన తమ బిడ్డ ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడ్డారు. భయం భయంగానే తమ బిడ్డను గ్రామమంతా వెతికారు. ఎంత సేపటికీ కనబడకపోవడంతో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
అత్యాచారం చేసి చంపిన తర్వాత మొదట బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్ ర్యాంపు సమీపంలో పడేసి వెళ్లిపోయారు.
జూపాడు బంగ్లా, మిడుతూరు, ముచ్చుమర్రి, బ్రాహ్మణ కొట్కూరు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముచ్చుమర్రి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం చుట్టుపక్కల అంతా తిరిగి పంప్ హౌస్ దగ్గరకు వచ్చి ఆగారు.
పోలీసులు ఎక్కడ గుర్తుపడతారో అని ముగ్గురు బాలురు బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్ ర్యాంపు నుంచి పంప్ హౌస్ దగ్గరకు తరలించి అక్కడ సమీపంలో కృష్ణానదిలో పడేశారు.
ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికని ఇంట్లోంచి వెళ్లిన బాలిక.. మూడు రోజులైనా కనిపించలేదు. గురువారం వరకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, విజయవాడ నుండి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల నుండి పాప మృతదేహం కోసం వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. అయితే పోలీసులు ఓ దుకాణ యజమానిని విచారించగా.. ఆ బాలిక ముగ్గురు బాలురుతో కనిపించినట్లు చెప్పారు. ఆమె దుకాణంలో కొనుక్కుందని కూడా చెప్పారు. ఆ ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చేసిన నీచపు పని గురించి మొత్తం పోలీసులకు వివరించారు. ఆ తర్వాత పోలీసులు ముచ్చుమర్రి పంప్ హౌస్ వద్ద బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను సైతం రంగంలోకి దింపారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బాలిక ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఇంకా బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు మైనర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వేర్వేరుగా ఘటనా స్థలానికి చేరుకుని బాధిత తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.