Idream media
Idream media
తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నడూ లేని ప్రాధాన్యం ఏర్పడింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడ్డ మార్పులే ఇందుకు కారణం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఆ మూడు ప్రాంతాల నేతలకే బాధ్యతలు అప్పగించి హోరాహోరీ తేల్చుకోమని అధిష్ఠానాలు వెనుక ఉండి మంతనాలు జరిపేవి. ఈ దఫా పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రతి పార్టీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ముఖ్య నేతలు కూడా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తూ తమ శ్రేణులతో మంత్రాంగం నడుపుతున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాలలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో ఓ సారి పరిశీలిస్తే…
ఖమ్మం- నల్లగొండ-వరంగల్ టీఆర్ఎస్ సిటింగ్ స్థానం. ఈసారి ఇక్కడ పోటీలో కీలక నేతలు ఉన్నారు. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను రంగంలోకి దింపింది. మరోవైపు, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక తెలంగాణ జనసమితి నుంచి కోదండరామ్ పోటీ చేస్తున్నారు. వీరు కాకుండా ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవి, తీన్మార్ మల్లన్న, వామపక్షాల మద్దతుతో జయసారధి పోటీలో ఉన్నారు. గతం కంటే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య కాస్త పెరిగింది. అలాగే నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు కూడా పెరిగారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,92,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,24,381 కాగా, మహిళలు 1, 68, 490, ఇతరులు 72 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓటర్లందరినీ ఆకట్టుకునే పనిలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి.
Also Read:పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు : హైదరాబాద్ పై ఎవరి ఎత్తుగడ ఏంటి?
పోటీలో ఉన్న అభ్యర్థులు, ఓటర్లను బట్టి ఈసారి ఒకటి, రెండు అంకెలతోనే జాతకాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరుగుతాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవి పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలు. తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటి లేదా రెండు ఇలా అంకెలు వేస్తారు. వీటినే ప్రాధాన్య ఓట్లు అంటారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కోదండ రాం వంటి నేతలు కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రిఫరెన్సియల్ ఓట్లను అంచనా వేయలేని పరిస్థితి. పోలైన ఓట్లలో ఎన్ని చెల్లుబాటు అవుతాయో గుర్తిస్తారు. అలా చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికంటే ఒకటి ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కౌంట్ చేస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అయినా కొలిక్కి రాకపోతే నాలుగో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కల చిట్టా తేలిన తర్వాతే విజేతను ప్రకటిస్తారు.
అప్పట్లో రెండో ప్రాధాన్య ఓట్లతో గట్టెక్కిన పల్లా
ఈసారి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఐదేసి లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉండటంతో ఎక్కువ మంది ఓటర్లను కలవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే స్వతంత్రులతో కొంత కథ నడిపించే పనిలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు పలానా వ్యక్తికి వేయాలని వారితోనే చెప్పిస్తున్నారు.
Also Read:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రైతు ఉద్యమంతో తలలు పట్టుకుంటున్న కమలనాథులు
అలాగే 2015 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను.. అప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. నాడు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచారు.
కరీంనగర్‌లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్ టీయూ అభ్యర్థి అయితే ఏకంగా ఆరో ప్రాధాన్య ఓట్లను కలిపిన తర్వాతే గట్టెక్కారు. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు విజయం నల్లేరుపై నడక కాదన్న టాక్ వినిపిస్తోంది. పట్టభద్రులను ఏరియాల వారీగా విభజించి వారిని కలిసి మాట్లాడే బాధ్యతను కొంత మంది ముఖ్యులకు అభ్యర్థులు అప్పగించారు. వారు ఓటర్లకు ఫోన్లు చేస్తూ తీరిక సమయం అడిగి మరీ కలుసుకుని తమ అభ్యర్థికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికకు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచార జోరు పెంచుతున్నారు.