ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రైతు ఉద్యమంతో తలలు పట్టుకుంటున్న కమలనాథులు

By Karthik P Mar. 05, 2021, 05:30 pm IST
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రైతు ఉద్యమంతో తలలు పట్టుకుంటున్న కమలనాథులు

భారత్‌లో ఎన్నికల కొత్తేమీ కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలవడం అయినా.. ఓడిపోవడం అయినా రాజకీయ పార్టీలకు సంబంధించినవి. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు మునపటికి భిన్నం.

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలే కాదు.. మరో బలమైన సమూహం కూడా పాల్గొంటోంది. వారే రైతులు. నూతనంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు మూడున్నర నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోడం లేదు. దీంతో రైతులు తమ సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించుకున్నారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు.

రైతు ఉద్యమం కేవలం ఉత్తర భారత్‌ దేశం వరకే పరిమితమనే అంచనాలున్నాయి. ఇటీవల పంజాబ్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోయారు. ఇదే తరహా ఫలితాలు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లోనూ బీజేపీకి రుచి చూపించాలనే కృతనిశ్చయంతో రైతులున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పాండిచ్చెరిలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రైతు ఉద్యమ నేత రాకేష్‌ టికాయత్‌ సన్నద్ధమయ్యారు. ఈ నెల 13వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్‌లో రాకేశ్‌ టికాయత్‌ నేతృత్వంలోని రైతు సంఘాల నేతలు ప్రచారం చేయనున్నారు.

రైతు ఉద్యమ నేతలు తీసుకున్న నిర్ణయం బీజేపీ అగ్రనేతలకు గుబులుపుట్టిస్తోంది. రైతు ఉద్యమ ప్రభావం ఎలా ఉంటుందో పంజాబ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపించింది. ఈ స్థాయిలో కాకపోయినా.. రైతు ఉద్యమ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉందని బీజేపీ నేతలకు తెలిసిన విషయమే. అయితే స్థానిక అంశాలను, జాతీయవాదాన్ని ఆసరాగా చేసుకుని గట్టేక్కవచ్చనే భావనలో ఉన్న బీజేపీ నేతలకు.. రైతు సంఘాల నేతల ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. రైతు సంఘాల నేతలు ఐదు రాష్ట్రాలలో ప్రచారం చేస్తే.. తమకు నష్టం తప్పదనే భావనలో కమలం పార్టీ నేతలున్నారు.

అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని, బెంగాల్, పాండిచ్చెరిలలో అధికారంలోకి రావాలనే లక్ష్యాలతో బీజేపీ పని చేస్తోంది. అదే సమయంలో కేరళలోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తమిళనాడుపై ఆశలు లేకున్నా.. అన్నాడీఎంకే రాజకీయం చేయాలని చూస్తోంది. ఇలాంటి లక్ష్యాలను పెట్టుకున్న బీజేపీ ఆశలపై రైతు ఉద్యమ నేతలు నీళ్లు చల్లేలా ఉన్నారు. ఇన్ని నెలలుగా చలి, వర్షంలో ఉంటూ ఉద్యమం చేస్తున్నా.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా.. కార్పొరేట్‌ ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్న విషయాన్ని రైతు సంఘాల నేతలు తమ ప్రచారంలో ప్రజలకు వివరించనున్నారు.

బీజేపీ ప్రభుత్వ అహంకారపూరిత నైజాన్ని ఎండగడతామని రాకేష్‌ టికాయత్‌ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోనూ మహా పంచాయత్‌లు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రైతు ఉద్యమ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీపై పడుతుందా...? లేదా..? అనేది మే 2వ తేదీన తెలుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp