iDreamPost
android-app
ios-app

6 ఏళ్ల తరువాత మురిసిన “ప్రకాశం” సాగర్ ఆయకట్టు

6 ఏళ్ల తరువాత మురిసిన “ప్రకాశం” సాగర్ ఆయకట్టు

ప్రకాశం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు ఆయకట్టు పరిధిలో ఈ సంవత్సరం సిరుల పంట పండింది. దీనితో రైతులు, రైతు కూలీలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ మొదట్లో ఆయకట్టుకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రానప్పటికీ, నీటి లభ్యతపై కొంచెం అనుమానం ఉన్న పరిస్థితుల్లోనే రైతాంగం పెద్ద ఎత్తున వారి నాట్లను ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం మంచి వర్షాలతో పాటు ఎగువ నుంచి కృష్ణానదికి పోటెత్తిన వరదలు ప్రకాశం జిల్లా సాగర్ ఆయకట్టు రైతాంగానికి బాగా కలసివచ్చాయి. దింతో నీటి లభ్యతపై రైతాంగానికున్న అనుమానాలన్నీ పటాపంచలవుతూ గతానికి భిన్నంగా ఈ ఏడాది సాగర్ నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోగలిగారు.

ఈ సంవత్సరంలో జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో అధికారికంగానే రికార్డ్ స్థాయిలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు కాలువలు ద్వారా 50.81 TMC ల నీరు జిలాకు సరఫరా కాగా, అందులో తాగునీటి వాడకానికి పోను 42 TMC ల నీటిని సాగుకు వినియోగించుకున్నారు. మొదట్లో కొన్ని ప్రాంతాలలో వారబందీ అమలులో కొంత సమస్యలు తలెత్తినప్పటికీ తరువాత పుష్కలంగా నీరు సరఫరా కావడంతో ఏ సమస్యలు లేకుండా రైతులు పంటను దక్కించుకోగలిగారు. ఇప్పటికే 90% పంట రైతుల ఇళ్లకు చేరింది. ఈ నేపథ్యంలో మార్చి 15 వరకు నీరిచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియచేశారు. దింతో ఆయకట్టు పరిధిలో రానున్న వేసవికాలంలో కూడా పశువులకు మేత, తాగునీటి సమస్య ఉండదని రైతాంగం సంతోషంగా ఉన్నారు.

జిల్లా పరిధిలో సాగర్ ఆయకట్టు కింద మొత్తం 4లక్షల 42 వేల ఎకరాలుండగా అందులో 1.86 లక్షల ఎకరాలు మాగాణి, 2.55 లక్షల ఆరుతడి పంటల విస్తీర్ణం వుంది. సాధారణంగా ప్రతి ఏటా 3.5 లక్షల ఎకరాల్లో సాగర్ నీటి మీద ఆధారపడి పంటలు వేస్తున్నారు. అందులో సగం వారి, మిగతా విస్తీర్ణంలో వాణిజ్యపంటలైన మిరప, పత్తి, పొగాకు, మొక్కజొన్న వంటి ఇతర పంటలు సాగవుతున్నాయి. అయితే సాగర్ కుడికాలువ చివరి ప్రాంతం కావడంతో ప్రతి ఏటా నీటి సరఫరా పెద్ద సమస్యగా తయారయింది. ఏ నేపథ్యంలో కీలకమైన సమయంలో పంటలకు నీరందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు.

సాగర్ కుడికాలువకు పూర్తి స్థాయిలో కేటాయింపులు 132 TMC లు కాగా, అందులో ప్రకాశం జిల్లా కు 55 TMC ల కేటాయింపు ఉంటుంది. అయితే జిల్లాలో అనధికారికంగా ఈ డిమాండ్ 70 TMC ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 55 TMC లకు మించి కేటాయించలేమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అసలు గత కొన్ని సంవత్సరాలుగా మగాణి కి నీళ్లందించలేమని అధికారులు ముందే చేతులెత్తేశారు. కేవలం ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తున్నారు.

ఈ సంవత్సరం మాత్రం డ్యాం లో నీరు పుష్కలంగా ఉండడంతో గత ఆగస్టు 7న సాగర్ కుడికాలువకి నీటిని విడుదల చెయ్యగా, ఆ జలాలు అదే నెల 12 న ప్రధాన కాలువ 85/3 నుండి జిల్లాలోకి ప్రవేశించాయి. అప్పటి నుండి నీటి సరఫరాలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రధాన కాలువ జిల్లా సరిహద్దు 85/3 వద్ద ఈ రోజుకి కూడా 1700 క్యూసెక్కుల నీరు స్థిరంగా ప్రవహిస్తుంది. అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో కూడా నీటి సరఫరా కొనసాగుతుంది. సాగర్ కాలువ పై ఆధారపడిన రామతీర్ధం జలాశయంలో ప్రస్తుతం 1.20 TMC ల నీరు నిల్వ ఉండగా, కాలువ పరిధిలోని చెరువుల్లో కూడా 70% నీరు నిల్వ ఉంది.

ఈ సంవత్సరం ఆయకట్టు పరిధిలో రైతులకు పంట దిగుబడి కూడా బాగానే వచ్చింది. అకాల వర్షంతో అక్కడక్కడా కొంతపంట దెబ్బతిన్నప్పటికి, సాగర్ ఆయకట్టు పరిధిలో అయితే ఎక్కడా దిగుబడులు తగ్గాయన్న మాట వినకపోవడం విశేషం. నాట్లు వేసే సమయంలో సమృద్ధిగా వర్షాలు కురవడం, వారబందీ తో పని లేకుండానే 75 వేల ఎకరాలు వరకు మాగాణి తగ్గి ఆస్థానంలో ఆరుతడి పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు ఈ సంవత్సరం కాస్త ముందుగానే సాగుకు రైతులు ఉపక్రమించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే గట్టెక్కారు. ఇప్పటికే 90% పంట రైతుల ముంగిళ్లకు చేరడంతో రైంతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.