iDreamPost
iDreamPost
1981లో స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన ‘కొండవీటి సింహం’ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కి బాక్స్ ఆఫీస్ కాసులతో కళాకళ లాడింది. ఇది వచ్చాక దీన్నే ఒక ట్రెండ్ గా తీసుకుని ఎందరో హీరోలు ఇలాంటి కథలతో భారీ హిట్లు కొట్టారు. ఆ తర్వాత ఈ టైటిల్ పెట్టుకునే సాహసం చేయలేదు కానీ 12 ఏళ్ళ తర్వాత అక్కినేని నాగార్జునకి ఇది సెట్ కావడం విశేషం. 1992లో అమితాబ్ బచ్చన్ హీరోగా ముకుల్ ఎస్ ఆనంద్ దర్శకత్వంలో చాలా భారీ బడ్జెట్ తో ‘ఖుదా గవా’ అనే సినిమా వచ్చింది. ఇందులో శ్రీదేవిది డ్యూయల్ రోల్. అప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యం కానీ రీతిలో దేశవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో దీన్ని రిలీజ్ చేశారు.
అప్పటికే లక్ష్మి కాంత్ ప్యారేలాల్ సంగీతం మారుమ్రోగిపోతోంది. ఎక్కడ విన్నా ఇవే పాటలు. ముఖ్యంగా ‘తు నజ మేరే బాదుషా’ అనే సాంగ్ మాములుగా ఎక్కలేదు. దీన్నే తర్వాత ‘పచ్చని సంసారం’ సినిమాలో కృష్ణ గారి కోసం పున్నాగపూల తోటలోగా వాడుకున్నారు. అదీ హిట్టే. అలా ఖుదా గవా ఎన్నో ప్రత్యేకతలను దక్కించుకుంది. ఇందులో ఇంకో కీలకమైన పాత్రను అక్కినేని నాగార్జున చేశారు. నిజానికి ఈ రోల్ ఆఫర్ చేసింది సంజయ్ దత్ కి. కొన్ని సీన్స్ షూట్ చేశారు కూడా. కానీ డేట్స్ సమస్యతో పాటు అదే సమయంలో సంజయ్ దత్ అక్రమాయుధాల కేసులో ఇరుక్కోవడంతో అది కాస్తా నాగార్జునని వరించింది. ఫస్ట్ సీన్ నుంచి లేకపోయినా నాగ్ కీలకమైన సమయం సమయంలో ఎంట్రీ ఇచ్చి సెకండ్ హాఫ్ అంతా కొనసాగుతారు.
రిలీజ్ టైంలో తెలుగు రాష్ట్రాలలోనూ భారీగా ఆడింది ఖుదా గవా. అయితే హింది రాని తెలుగు ప్రేక్షకులు దీన్ని మిస్ అవుతున్నారన్న కారణంతో కొన్ని నెలల తర్వాత దీన్నే కొండవీటి సింహం పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. గొప్పగా కాదు కాని డీసెంట్ గానే ఆడింది. నాగార్జున దీనికి స్వంతంగా డబ్బింగ్ ఇవ్వలేదు. వేరే వాళ్ళతో చెప్పించారు. ఆఖరి పోరాటం తర్వాత శ్రీదేవి, నాగ్ జంటగా నటించిన సినిమా ఇదే. ఆపై గోవింద గోవిందా చేశారు. అదే ఆఖరుది. అమితాబ్ తో ఫుల్ లెంత్ మూవీలో నాగ్ నటించింది ఇందులోనే. మనంలో బిగ్ బి అలా తళుక్కున ఓ సీన్లో మెరిసి మాయమైపోతారు. అలా అన్నగారి టైటిల్ తో కొండవీటి సింహం రూపంలో నాగ్ చేయడం ఇప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది.