నాడు–నేడు, జగనన్న విద్యా కానుకకు జాతీయ స్థాయి ప్రశంసలు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహ‌న్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన వివిధ ప‌థ‌కాల‌కు ప్రశంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానంగా విద్యా రంగంలో నూత‌న సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా తీసుకొచ్చిన ప‌థ‌కాల‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖులు, విద్యా రంగ నిపుణులు అభినంద‌న‌లు కుపిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని విద్యా రంగాన్ని స‌మూలంగా మార్చి..పేద బ‌డుగు బ‌లహీన వ‌ర్గాల విద్యార్థుల‌కు ఉద్యోగ‌వ‌కాశాల కోసం, అంత‌ర్జాతీయంగా రాణించ‌డం కోసం ఇంగ్లీష్ మీడియం విద్య‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వాటితో పాటు పాఠ‌శాలల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సిఎం జ‌గ‌న్ న‌డుం బిగించారు.

రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగానికి దశ, దిశ చూపుతూ సిఎం వైఎస్ జ‌గ‌న్‌ ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలపై జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ప్రశంసల జల్లు కురిపించారు. న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ సమాఖ్య (ఏఐపిటిఎఫ్‌) మహిళా చైర్‌పర్సన్‌ గీతా పాండే (ఉత్తర్‌ప్రదేశ్‌) అధ్యక్షతన శనివారం “కోవిడ్-19.. బాలిక‌ విద్యపై దాని ప్రభావం, ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు’’ అనే అంశంపై జాతీయ స్థాయిలో వీడియో ఆధారిత స‌ద‌స్సు జ‌రిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ (ఆప్టా) మహిళా చైర్‌పర్సన్‌ అనపర్తి పద్మావతి (బొబ్బిలి), వైస్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌విఎల్‌ పూర్ణిమ (శ్రీకాకుళం) పాల్గొన్నారు. వీరితో పాటు 25 రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా చైర్‌పర్సన్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.

లాక్‌డౌన్‌ సమయంలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు, పాఠశాలల్ని పునఃప్రారంభించేందుకు చేపడుతున్న చర్యలతో పాటు ఆన్‌లైన్‌ తరగతులు, పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని పాఠశాలలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, సంఘాల పాత్ర, మధ్యాహ్న భోజన పథకం అమలు, గ్రామీణ, కొండ ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి శానిటైజర్లు, మందులు, మాస్క్‌ల‌ సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై అనపర్తి పద్మావతి, ఎస్‌విఎల్‌ పూర్ణిమ మాట్లాడుతూ మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు జరుగుతున్న కృషిని వివరించారు.

ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభమైన తరువాత విద్యార్థులకు జగగన్న విద్యా కానుక పేరుతో అందించనున్న కిట్ల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రాంపాల్‌ సింగ్, సెక్రటరీ జనరల్‌ కమల్‌ కాంత్‌ త్రిపాఠీ అభినందించారని పేర్కొన్నారు. వెబినార్‌లో చర్చించిన అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎజిఎస్‌ గణపతిరావు, కె. ప్రకాశరావు తెలిపారు.

Show comments