iDreamPost
iDreamPost
హఠాత్తుగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఏలూరు తల్లడిల్లిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో సామాన్యులు మూర్చ తరహాలో స్పృహ కోల్పోతున్న తీరు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమయిన యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే మూడింట్ రెండు వంతుల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఒక్కరు మృతి చెందినట్టు ప్రకటించారు. మరణించిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు.
ఎలా మొదలయ్యింది…
ఏలూరులో నాలుగు రోజులుగా కొందరికి అస్వస్థత ఏర్పడడంతో ఆస్పత్రులకు వెళుతున్నారు. ఆ తర్వాత వెంటనే వారు కోలుకుని సాధారణ స్థితికి చేరడంతో పెద్ద సమస్యగా ఎవరూ గుర్తించలేదు. కానీ శనివారం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అలాంటి సమస్య వెలుగులోకి రావడంతో అలజడి రేగింది. ఒకేరోజు 100 మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఆదివారం రాత్రికి ఆసంఖ్య 300 దాటింది. అయితే ఇప్పటికే 210 మంది బాధితులు డిశ్ఛార్జ్ అయ్యారు.
సహజంగా స్పృహ కోల్పోతున్నట్టు వారు చెబుతున్నారు. తల తిరగడం, కొందరికి వాంతులు కావడం, మరికొందరికి నోటి నుంచి నురగ కూడా రావడంతో ఫిట్స్ సంబంధిత సమస్యగా భావిస్తున్నారు.
పరీక్షల్లో కనిపించని సమస్యలు
సమస్య ఎక్కువ మందిలో రావడంతో శనివారం సాయంత్రం నుంచే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా రంగంలో దిగారు. బాధితులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆందోళన తగ్గించి వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని రకాలుగానూ ప్రయత్నాలు సాగించారు.
అదే సమయంలో బాధితుల నుంచి శాంపిళ్లు సేకరించిన పరీక్షలు చేశారు. వాటిలో వైరాలజీ, బ్యాక్టీరియా తరహా సమస్యలు ఏమీ లేవని నిర్ధారణ జరిగింది. దాంతో అసలు సమస్య ఏమన్నది అంతుబట్టకుండా ఉంది. ట్యాక్సిన్స్ సంబంధిత సమస్యగా అంచనాలు వేస్తున్నారు కానీ నిర్ధారణ కాలేదు. ఆస్పత్రుల్లో చేరిన వారు కొందరు అరగంటకే సాధారణ స్థితికి చేరుకుని డిశ్ఛార్జ్ అవుతున్నారు. అదే సమయంలో ఈ సమస్య ఎక్కువ మంది యువతలో కనిపిస్తోంది. పిల్లలు, వృద్ధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది.
తాగునీటి కలుషితం కాలేదు..
తాగునీటి సమస్యల మూలంగా ఈ సమస్య ఏర్పడిందని విపక్షనేతలు కొందరు ఆరోపించారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్య మీద తక్షణం అప్రమత్తమయ్యి ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ క్యాంపులు, అదనపు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలో దింపుతుంటే, విపక్ష టీడీపీ నేతలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం విషయాన్ని మరింత తీవ్రం చేసేలా వ్యవహరించడం విస్మయకరంగా మారింది.
మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయలేదని, పైపులైన్లలో కలుషిత జలాలు వచ్చి చేరాయని తనకు తోచిన విధంగా లోకేష్ విమర్శలు చేశారు. కానీ తీరా ఏలూరు మంచినీటిని పరీక్షలు చేస్తే ఎటువంటి సమస్యలు లేవని తేలింది. అంతేగాకుండా ఒక్క ట్యాంకు శుభ్రం చేయకపోతే ఆ ప్రాంతంలో సమస్య రావాలి. కానీ నగరంలో మొదట వన్ టౌన్ లో మొదలయ్యి ఆతర్వాత వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సమస్య కనిపించడంతో తాగునీటి మీద టీడీపీ ఆరోఫణల్లో పసలేదని తేలిపోయింది.
రంగంలోకి ఎయిమ్స్ బృందం
ఏలూరు ఆరోగ్య సమస్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దాంతో కేంద్రం కూడా చొరవ చూపింది. నేరుగా గవర్నర్ స్పందించారు. ఆవెంటనే మంగళగిరి నుంచి ఏడుగురు వైద్య నిపుణుల బృందం ఏలూరు బయలుదేరింది. అసలు కారణాలు అన్వేషించే ప్రయత్నం చేస్తోంది. పలు సందేహాలున్నప్పటికీ బాధితుల వెన్ను నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కరోనా సమస్య కూడా ఏ ఒక్కరికీ లేకపోవడంతో అసలు కారణాలు అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
రంగంలోకి సీఎం…
తాజా పరిస్థితుల్లో సీఎం నేరుగా సీన్ లోకి వచ్చారు. సమస్య ఏర్పడిన వెంటనే ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులను సమన్వయం చేస్తున్న సీఎం నేరుగా పర్యటన కి బయలుదేరారు. ఏలూరులో బాధితులను పరామర్శించి. అవసరమైన చర్యలకు పూనుకుంటామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఏలూరు వాసులకు మరింత భరోసా కల్పించినట్టవుతుందని అంతా భావిస్తున్నారు.