iDreamPost
android-app
ios-app

ఏవి సుబ్బారెడి హత్య కుట్ర భగ్నం.

  • Published Mar 21, 2020 | 3:51 PM Updated Updated Mar 21, 2020 | 3:51 PM
ఏవి సుబ్బారెడి హత్య కుట్ర భగ్నం.

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి ఆప్త మిత్రుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు జరిపిన కుట్రను చిన్న చౌక్ పోలీసులు భగ్నం చేశారు. సుబ్బారెడ్డిని హతమార్చేందుకు అదే జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు 50 లక్షల సుపారీ ఇచ్చి డీల్ కుదుర్చుకునట్టు తెలుస్తుంది. అయితే కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుండి 3 లక్షల 20వేల రూపాయల నగదు, ఒక పిస్టల్, ఆరు తూటాలు, 2 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన సంజూ రెడ్డి సూడో నక్సలైట్ గా వెళ్ళడైంది.

హత్యకు పన్నిన కుట్రకు సంబంధించి వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ వెళ్లడిస్తూ ఎవరు ఈ హత్యకు సుపారీ ఇచ్చారనేది పూర్తి విచారణ తరువాత వెళ్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రెండుసార్లు సుబ్బారెడ్డి హైదరాబాద్‌ ఇంటిని రెక్కీ చేసిన నిందితులు. పోలీసులకు భయపడి వెనక్కి వచ్చారని చెప్పారు. ఇది ఇలా ఉంటే భూమా నాగిరెడ్డి మరణం తరువాత మాజీ శాసన సభ్యురాలు భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియకు సుబ్బారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేపట్టిన సైకిల్ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట వద్ద అతని ప్రత్యర్థులు రాళ్ల దాడి జరిపారు ఈ ఘటనపై సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆళ్లగడ్డ తెలుగుదేశం రాజకీయాల్లో ఇప్పటికే వర్గ పోరు తీవ్రంగా ఉన్న సమయంలో ఇప్పుడు అగంతకులు సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్ని పోలీసులకు దొరకడంతో ఒక్కసారిగా ఆళ్ళగడ్డ లో వాతావరణం వేడెక్కింది.