iDreamPost
iDreamPost
కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి వాటిలో సినిమాలు లేక హాళ్లు బోసిపోతున్నాయి కానీ మరోపక్క టీవీ ఛానల్స్ ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ఓటిటి విప్లవం ఎంత ఉన్నప్పటికీ అవి అందరికి చేరడం లేదు. సామాన్య ప్రేక్షకుడికి వినోదం అంటే ఇప్పటికీ టెలివిజన్ లేదా స్మార్ట్ ఫోన్ అంతే. ఒకవైపు సీరియల్స్ పూర్తిగా ఆగిపోవడంతో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ కు సినిమాలు వేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. గతంలో ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 గంటల దాకా సీరియళ్ళతో వాయించే ఛానల్స్ అన్నీ మూవీస్ తో నిండిపోతున్నాయి.
రిమోట్ లో ఏ నెంబర్ నొక్కినా ఇవే కనిపిస్తున్నాయి. ఆఖరికి ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చిన రామాయణం సీరియల్ ని కోట్ల సంఖ్యలో ఎగబడి చూశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఛానల్స్ చాలా తెలివిగా తక్కువ సినిమాలనే ఎక్కువ రిపీట్ రన్స్ వేస్తూ రేటింగ్స్ తో పాటు యాడ్స్ ని కూడా బాగానే వచ్చేలా చేసుకుంటున్నాయి. గతంలోనే వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘రాక్షసుడు’ ఇటీవలే రిలీజై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన విశ్వక్ సేన్ ‘హిట్’ కంటే ఎక్కువ రేటింగ్ రాబట్టుకోవడాన్ని గమనించాలి. మహేష్ బాబు ‘మహర్షి’ సైతం ఆశ్చర్యపోయే రీతిలో 8 ప్లస్ రేటింగ్ తెచ్చుకుంది. పైన చెప్పిన రెండు సినిమాల కన్నా ఇది చాలా ఎక్కువ.
‘సరిలేరు నీకెవ్వరు’ టీవిలో బాహుబలి రికార్డుని బ్రేక్ చేశాక సెకండ్ టెలికాస్ట్ విషయంలో సన్ నెట్ వర్క్ తొందరపడటం లేదు. ఇప్పటికీ ‘అల వైకుంఠపురములో’ ప్రసారం జరగలేదు. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారన్న ఫిర్యాదు ఉన్నప్పటికీ జనం వేరే ఆప్షన్ లేకపోవడంతో వీటినే చూస్తున్నారు. యాడ్స్ పెద్దగా లేకపోవడంతో చిన్న బ్రేకులతోనే విసుగు లేకుండా షోలు జరిగిపోతున్నాయి. అందుకే డిజిటల్ లో ఎప్పుడో వచ్చేసిన ‘డిస్కో రాజా’, ‘అశ్వద్ధామ’ లాంటి చిత్రాలను తొందరపడి శాటిలైట్ లో వేసేయకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాయి. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉండటంతో స్టాక్ లో సినిమాలన్నీ ఇప్పుడు ఛానల్స్ కి బంగారు బాతులా మారిపోయాయి.