iDreamPost
iDreamPost
మాములుగా పరిశ్రమలో మొదటి సినిమా ఫ్లాప్ అయితే శాపంగా భావిస్తారు. కానీ అదేంటో కొందరికి మాత్రం హిట్ అయితే శాపంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆరెక్స్ 100తో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ అందం పరంగా పెర్ఫార్మన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది కానీ ఆ తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. మొదటి సినిమాలో కామం నిండిన అమ్మాయిగా నమ్మించిన వాడిని మోసం చేసే పాత్రలో జీవించేసిన పాయల్ ను రెగ్యులర్ హీరోలు తమ పక్కన తీసుకునేందుకు సాహసించలేదు.
ఫలితంగా మీడియం రేంజ్ మూవీస్ కే పరిమితం కావాల్సి వచ్చింది. సరే ట్రై చేసి చూద్దామని సీనియర్లైన వెంకటేష్, రవితేజ సరసన చేస్తే అవి తనకు ఉపయోగపడలేదు సరికదా మైనస్ అయ్యాయి. ఇంత త్వరగా ఏజ్ బార్ హీరోలతో చేయడం బెడిసి కొట్టింది. ఇవి చాలదన్నట్టు ఆర్డీఎక్స్ లవ్ అనే బూతు సినిమా తెచ్చిన అప్రతిష్ట అంతా ఇంతా కాదు..
గతంలో అంటే ఇరవై ఏళ్ళ క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఉషాకిరణ్ మూవీస్ నువ్వే కావాలి నిర్మించింది. ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కానీ తరుణ్ ని పక్కింటి అబ్బాయిగా విపరీతంగా ఇష్టపడిన ప్రేక్షకులు తర్వాత అతను ఏ సినిమా చేసినా నువ్వే కావాలికి మించి ఊహించుకోవడంతో అంచనాలు తలకిందులై వరుస పరాజయాలు అందుకుని రెండు మూడు హిట్లతో త్వరగా కెరీర్ ని ముగించుకోవాల్సి వచ్చింది.
ఇంచుమించు ఉదయ్ కిరణ్ ది కూడా ఇదే కథ. డెబ్యూ మూవీ చిత్రం సూపర్ హిట్ అయ్యాక ‘నువ్వు నేను’ తెచ్చిన స్టార్ డంని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు ఈ కుర్రాడు. అప్పుడెప్పుడో నిర్మలమ్మ, అన్నపూర్ణ లాంటి ఆర్టిస్టులు చాలా చిన్న వయసులోనే ముసలి తల్లులుగా పర్మనెంట్ గా నటించాల్సి రావడానికి కారణం ఆయా పాత్రల్లో వాళ్ళు మొదటి హిట్టు అందుకోవడమే. దాంతో ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళు అందరికి కామన్ మదర్స్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతేనే చాలా ఉన్నాయి కానీ సక్సెస్ ఉంటేనే పలకరించే పరిశ్రమలో ఇలాంటివి జరగడం విచిత్రమే