iDreamPost
android-app
ios-app

OTTకి క్యు కడుతున్న సినిమాలు

  • Published Apr 29, 2020 | 12:13 PM Updated Updated Apr 29, 2020 | 12:13 PM
OTTకి క్యు కడుతున్న సినిమాలు

కరోనా ప్రభావం వల్ల మొదట్లో తెలియలేదు కానీ మెల్లగా దాని తాలూకు సెగలు విపరీతం వైపు మళ్లుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు ఫీడింగ్ లేక హాళ్లు మూతబడి గగ్గోలు పెడుతుండగా జనం ఓటిటిలకు బాగా అలవాటు పడిపోతుండటం ఖంగారుని రెట్టింపు చేస్తోంది. ఈ రోజు టాలీవుడ్ లో మొదటి సినిమాగా అమృతరామమ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో నేరుగా రిలీజయింది. అది చిన్న సినిమానా పెద్ద మూవీనా అన్నది ఇక్కడ అప్రస్తుతం. అడుగైతే పడిపోయింది. రేపు పెద్దవాళ్ళే దిగొచ్చు. ఎవరికి తెలుసు.

మరోవైపు కోలీవుడ్ లో ఓటిటికి మద్దతు అంతకంతా పెరుగుతూ పోతోంది. సూర్య సినిమాలను నిషేధిస్తామని డిస్ట్రిబ్యూటర్లు వార్నింగ్ ఇచ్చినా సరే తన భార్య చిత్రం ‘పొన్మగల్ వంతాల్’ ని ప్రైమ్ ద్వారా నేరుగా రిలీజ్ చేస్తున్నాడు సదరు నిర్మాత. ఇదిలా ఉండగా ఇప్పుడు మరికొన్ని ఇదే రూట్లో వరసగా క్యూ కట్టబోతున్నాయి. బొమ్మరిల్లు సిద్దార్థ్ హీరోగా రూపొందిన ‘టక్కర్’ డిజిటల్ వైపే చూస్తోందట. దీని హిందీ తెలుగు డబ్బింగ్ పనులు తెరవెనుక ఆన్ లైన్ ద్వారా చేయిస్తున్నారని సమాచారం.

కమెడియన్ యోగిబాబు నటించిన ‘కాక్ టైల్’, త్రిష మెయిన్ లీడ్ గా నటించిన ‘పరమపదం విలయాట్టు’, హాస్యనటుడు సంతానం హీరోగా చేసిన ‘సర్వర్ సుందరం’ తదితర సినిమాలన్నీ ఓటిటి కోసం డీల్స్ మాట్లాడుకునే పనిలో బిజీగా ఉన్నట్టు వినికిడి. సెప్టెంబర్ దాకా సినిమా హాళ్లకు పూర్తి స్థాయిలో జనం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రకంగానైనా కొంత గట్టెక్కుదామనే నిర్మాతల ఆలోచన మంచిదే. ప్రముఖ నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ దీన్ని సమర్ధించక తప్పదని కాకపోతే ఈ ఓటిటి విప్లవం తాత్కాలికమేనని, పరిస్థితి సద్దుమణిగాక జనం థియేటర్లకు రావడం ఖాయమని నొక్కి చెబున్నారు. లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందో లేదో చెప్పలేం కానీ థియేటర్ల తలుపులు మాత్రం అంత సులభంగా తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఈలోగా ఓటిటి సంస్థలు పండగ చేసుకోవడం ఖాయం