iDreamPost
android-app
ios-app

కుర్చి వేస్తారా అని నాలుక్కరుచుకుంటున్నారు..!!

కుర్చి వేస్తారా అని నాలుక్కరుచుకుంటున్నారు..!!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాదిన్నర అవుతోంది. ఈ ఏడాదిన్నరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుని ఏపీని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఏడాదిన్నర గడిచినా.. ఇంకా వైఎస్‌ జగన్‌ పరిపాలన తీరుపై ప్రతిపక్ష టీడీపీ ఓ అంచనాకు రాలేకపోతోంది. ప్రతిసారి ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూ ఆనక నాలుక్కరుచుకుంటోంది.

గత నెలలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు వెంటనే పాలక మండళ్లను కూడా వైఎస్‌ జగన్‌ నియమించారు. ప్రతి కార్పొరేషన్‌కు ఒక చైర్మన్‌/చైర్‌పర్సన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. మొత్తం మీద 56 చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పోస్టులు, 672 డైరెక్టర్‌ పదవులు 139 బీసీ కులాల నేతలకు దక్కాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు ప్రభుత్వంలో పదవులు దక్కడంపై రాష్ట్రంతోపాటు దేశం మొత్తం ఏపీ వైపు చూసింది. వివిధ రాష్ట్రాల నేతలు సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలుపుతూ లేఖలు కూడా రాశారు.

అయితే ప్రతిపక్ష టీడీపీకి మాత్రం ఈ నిర్ణయం వెన్నులో వనుకుపుట్టించింది. ఇప్పటి వరకూ తమకు వెన్నుదన్నుగా ఉన్న బీసీ దూరం అవుతున్నారనే ఆందోళనలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం… కనీసం వారికి కుర్చీలు అయినా వేస్తుందా..? అంటూ కార్పొరేషన్ల ఏర్పాటను హేళన చేసింది. కుర్చి కూడా వేయలేని బీసీ కార్పొరేషన్ల పదవులు ఇవ్వడం వల్ల బీసీలకు ఏమి ప్రయోజనమని విమర్శించింది.

అయితే బీసీ కార్పొరేషన్ల పదవులను తక్కువచేసి చూపే టీడీపీ నేతలకు తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులా మారింది. 56 బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌లకు నెల జీత భత్యాలు, డైరెక్టర్లకు జీతాలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌/చైర్‌పర్సన్‌ల జీత, భత్యాలు, వసతి, ఇతర అలవెన్స్‌లు, నలుగురు సిబ్బందికి నెలకు 2,56,500 రూపాయలు నిర్ణయించింది. ఇందులో చైర్మన్‌/చైర్‌పర్సన్‌కు నెల జీతం 65,000 కూడా కలిసే ఉంటుంది. డైరెక్టర్లకు నెలకు 14 వేల రూపాయల జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ నెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

అంటే వచ్చే నెల 1వ తేదీన చైర్మన్‌/చైర్‌పర్సన్లు నెల జీతం 65 వేలు, డైరెక్టర్లు 14 వేలు అందుకోబోతున్నారు. నాడు ఈ పదవులపై చౌకబారు విమర్శలు చేసిన టీడీపీ నేతలు నేడు నాలుక్కరుచుకుంటున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో కూడా బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించక ముందే డిమాండ్లు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో టీడీపీ నేతలు నాలుక్కరుచుకుని మౌనాన్ని ఆశ్రయించారు.