Jai Bhim Suriya : హీరోలను కొడితే డబ్బు.. కొట్టడం అంతా ఈజీనా?

  • Published - 07:10 AM, Wed - 17 November 21
Jai Bhim Suriya : హీరోలను కొడితే డబ్బు.. కొట్టడం అంతా ఈజీనా?

సినిమా నటీనటులు అంటే అటు రాజకీయ నాయకులు మొదలు సామాన్యుల దాకా అందరికీ చిన్న చూపే. తమిళ సినీ పరిశ్రమలో తాజా పరిస్థితులు చూస్తుంటే సగటు సినీ ప్రేమికుడి కడుపు మండిపోక తప్పదు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం మొదలు సదరు సినిమాలో హీరోలను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు, దాడులు చేస్తామంటూ బెదిరించడం రాక్షస మనస్తత్వానికి పరాకాష్టగా మారుతోంది. సినిమా అనేది ఒక ఎంటర్ టైన్మెంట్ సాధనంగా చూడకుండా సినిమాలో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని చూస్తూ కూడా మాకెందుకులే అని లైట్ తీసుకోవడం ఖండించాల్సిన అంశం.

ముందు సేతుపతి
కొద్ది రోజుల క్రితం విజయ్ సేతుపతి మీద దాడి జరిగినట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ వ్యక్తి విమానాశ్రయంలో వెళ్తున్న విజయ్ సేతుపతి మేనేజర్ ను ఎగిరి తన్నాడు. అయితే అసలు ఏం.జరిగిందో బయటకు తెలియక పోవడంతో సేతుపతి స్పందిస్తూ చిన్న వివాదమని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి, ఎన్నిసార్లు తంతే అన్ని వెయ్యి రూపాయలు ఇస్తానని హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన చెబుతున్న కారణాలు పెద్దవే అయినా అవి సేతుపతి అన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు.. ఒకవేళ అన్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి అంతే కానీ కొడితే డబ్బు ఇస్తానని ప్రకటించడాన్ని ఏమనాలి?

తర్వాత సూర్య
ఇప్పుడు హీరో సూర్య వంతు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో సూర్య కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టించడానికి ప్రయత్నించారట. ఈ మేరకు వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె పోలీసులను కోరింది. అంతే కాక సూర్య తమ జిల్లాకు వస్తే అతనిపై దాడి చేయాలని, దాడికి పాల్పడిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని సదరు పార్టీ నేత బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. సినిమాలో తమకు నచ్చని విషయాలు ఉంటే పోలీసు కేసు పెట్టచ్చు, లేదా కోర్టుకు వెళ్ళవచ్చు, సినిమాని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేయచ్చు, అంతే కానీ ఆ సినిమా హీరోలను కొట్టాలని ప్రేరేపించడం ఎంత వరకు కరెక్ట్ ? హీరోలపై దాడి చేయమని చెప్పి యువతను పెడదోవ పట్టించడమే కదా.. ఈ విషయములో ప్రభుత్వం స్పందించకుంటే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.

Also Read : Anubhavinchu Raja : జీవితాన్ని అనుభవించమంటున్న సెక్యూరిటీ గార్డు

Show comments