Idream media
Idream media
పోలీసులు, డబ్బు, మద్యం లేకుండా వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నిలకు వెళితే.. సీఎం జగన్ పెట్టిన నిబంధనతో సగం కేబినెట్ ఖాళీ అవుతుందంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఓటమికి భయపడే సీఎం జగన్ మంత్రులకు టార్గెట్లు పెట్టారని విమర్శిస్తున్నారు. మళ్లీ ఇదే వెంకన్న.. నిజాయతీగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనంటున్నారు. తర్కం లేకుండా మాట్లాడుతూ తనకు తానే పోటీ అనేలా వెంకన్న వ్యవహరిస్తున్నారు.
ధనం, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ తన అభిలాషను వెల్లడించారు. స్థానిక సంస్థలతో ఈ విధానం మొదలు పెట్టి వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఇలా చేసి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. మాటలు చెప్పడమే కాదు.. వాటిని ఆచరణలో కూడా పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడిన వారికి రెండేళ్లు జైలు శిక్ష, అభ్యర్థులు గెలిచినా వారిని అనర్హులను చేసే నిబంధనలతో ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం వెంకన్న మరిచిపోయినట్లున్నారు. వెంకన్న కోరుకున్నట్లు ఎన్నికలను నిజాయతీగా నిర్వహించేందుకు ఈ నిబంధనలతో ఏకంగా ఆర్డినెన్స్‌ను జగన్ సర్కార్ జారీ చేసింది.
పార్టీలతో సంబంధం లేకుండా ఎవరూ మద్యం, నగదు పంచినా శిక్ష తప్పదని, ఎస్పీలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం,నగదు పంపిణీని అరికట్టడంతో ఎస్పీలు విఫలమైతే వారిపై వేటు తప్పదని కూడా హెచ్చరించారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులకు కాకుండా నేరుగా కార్యనిర్వాహఖ యంత్రాంగానికే సీఎం జగన్ ఆదేశాలు జారీ చేస్తూ ఈ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుతున్నా ప్రతిపక్ష పార్టీ నేత అయిన వెంకన్న రాజకీయ విమర్శలు చేయడాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు.