ఈరోజు అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంధ్రీకరణ అంశాలపై జరిగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పౌరులందరూ సమానమేనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందన్నారు. గతంలో అభివృద్ధి వికేంధ్రీకరణ జరగగాపోవడం వల్లే తెలంగాణా ఉద్యమం వచ్చి రాష్ట్రం చీలిపోయిందని, ఆ అనుభవాల నుండి మనం ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమీషన్, శివరామకృష్ణన్ కమిటీ తో పాటు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించిన జియన్ రావు కమిటీ, హైపర్ కమిటీలు కూడా రాష్ట్ర సమగ్రాభివృద్దికి అభివృద్ధి వికేంధ్రీకరణ ఏకైక ప్రత్యామ్న్యాయం అని సూచించాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి అంతా ఒక చోటే కేంద్రికరంచి, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి డిజైన్లు పేరుతొ ప్రజలను మభ్యపెట్టి కాలం వెల్లదీశారన్నారు. ఆయన చెప్పిన విధంగా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వాలంటే ఇప్పటికిప్పుడు లక్ష తొమ్మిది వేల కోట్లు కావాలని, కానీ వాస్తవంగా గత ఐదేళ్ళలో చంద్రబాబుగారు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని, ఇలాంటి సమయంలో మొత్తం నిధులన్నీ ఒక్క అమరావతికి ఖర్చుపెడితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి, విద్యా, వైద్యం సాగునీటి కల్పనా వంటి కార్యక్రమాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు.
గతంలో అమరావతికి నిధులిస్తామని చెప్పిన ప్రపంచ బ్యాంక్ చంద్రబాబు ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాల వల్లనే నిధులివ్వకుండా వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. దేశంలో వెనుకబడిన జిల్లాలు గా 105 జిల్లాలను నీతి ఆయోగ్ ప్రకటిస్తే అందులో మూడు జిల్లాలు కడప విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు విశాఖ కి కార్యానిర్వాహణ రాజధానిని, కర్నూల్ కి హైకోర్టు ని తీసుకొస్తే చంద్రబాబు కి వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు.
గతంలో ఇదే హౌస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగ సాగునీటి అవసరాల దృష్యా మనకి కేటాయించిన నది జలాలను పూర్తిగా వాడుకోవడానికి రాయలసీమలో పెండింగ్ పనులన్నీ పూర్తిచేసుకోవాలని, ఉత్తరాంధ్రలో ప్రజలకు నేటి వరకు సురక్షితమైన త్రాగునీరు కూడా అందుబాటులో లేదని అందువల్లే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చెయ్యాల్సిన భాద్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పారు. అందువలనే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకి వెళుతుంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రజల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.