Idream media
Idream media
తెలంగాణలో అధికార పార్టీలో చోటు చేసుకున్న రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి. నిన్న సాయంత్రం ఈటలపై భూ కబ్జా ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే ఇవన్నీ ఆయనపై కావాలనే చేసిన ఆరోపణలనే చర్చ సర్వత్రా జరిగింది. కావాలనే ఈటలను లక్ష్యంగా చేసుకున్నారని టీఆర్‌ఎస్ సొంత ఛానెల్ టిన్యూస్‌లో వెలువడిన కథనాల ద్వారా అర్థమైంది.
ఈటల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఊహించినట్లుగానే ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఆయన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరిణామంతో ఈటల శాఖలేని మంత్రిగా మిగిలిపోయారు.
Also Read : ఈటెల మాజీ మంత్రి కాబోతున్నారా..?
మంత్రి ఈటల పర్యవేక్షిస్తున్న శాఖను తీసుకున్న కేసీఆర్.. ఆయనకు పరోక్ష సందేశం పంపారు. మంత్రి పదవికి రాజీనామా చేసేలా శాఖను తీసుకున్నారు. ఇప్పుడు ఈటల ఏ శాఖ లేని మంత్రిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిగా కొనసాగేందుకు ఇష్టపడకపోవచ్చు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసించిన ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే.. తనపై వ్యతిరేకత వస్తుందనే భావనలోనే కేసీఆర్ ఈ తరహాలో రాజకీయాన్ని నడిపారని భావించొచ్చు. ఈటల తనకు తానుగా రాజీనామా చేస్తే.. విమర్శల నుంచి కేసీఆర్ కొంత మేర తప్పించుకునే అవకాశం ఉంది.
తన శాఖను సీఎం కేసీఆర్ తీసుకోవడంపై ఈటెల స్పందించిన తీరుతో ఆయన టీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రోజుల నుంచి తాను కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు యత్నిస్తున్నా.. వారు ఆపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఈటెల చెప్పారు. తన శాఖను సీఎంకు బదిలీ చేశారని తెలిసిందన్న ఈటెల సంతోషమని వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు. ఇక కేసీఆర్‌ను గానీ కేటీఆర్‌ను గానీ కలవబోనని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల తరఫున పని చేస్తానని తెలిపారు.
Also Read : ఈటల.. తెగే దాకా లాగారా..?