iDreamPost
iDreamPost
విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా రూపుదిద్దే పనిలో ఉన్న ప్రభుత్వం అదే సమయంలో ఐటీ పరిశ్రమల కు మరింత అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విశాఖలో పర్యటించారు. రాబోయే ఏడాది కాలంలో మరో 50వేల ఐటీ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చనీయాంశం అవుతున్న మిలీనియం టవర్స్ పై మంత్రి క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా ఐటీ కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా తమ ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తుందనే సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో ఐటీ కంపెనీల విస్తరణకు అనుగుణంగా మిలీనియం టవర్స్ అభివృద్ది చేయబోతున్నట్టు తెలిపారు. కాడ్యుయెంట్ వంటి కంపెనీల విస్తరణకు లక్ష చదరపు గజాల స్థలం అడిగారని, దానిని కేటాయిస్తామని కూడా చెప్పడం ద్వారా మిలీనియం టవర్స్ భవితవ్యంపై మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతోంది.
అదే సమయంలో ఆదానీ కంపెనీ విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నారంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే యత్నం చేశారు. 70వేల కోట్ల పెట్టుబడులంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని, కేవలం 3వేల కోట్ల పెట్టుబడులకే వారు అంగీకరించారని, అయినా అదానీ కంపెనీ వెళ్లిపోయిందనే ప్రచారం వాస్తవం కాదని, మరో స్థలం కోరుకున్నారని, కేటాయిస్తామని చెప్పడం ద్వారా మంత్రి తమ వైఖరిని వెల్లడించారు. అంతేగాకుండా టీడీపీ వాదనలు, విమర్శల ద్వారా ఐటీ కంపెనీల అభివృద్దికి ఆటంకం ఏర్పడుతోందని ఎదురుదాడికి దిగారు.
మరోవైపు ఇప్పటికే మిలీనియం టవర్స్ సమీపంలో ఉన్న ఇతర ఐటీ కంపెనీలకు కేటాయించి, ఖాళీగా ఉన్న స్థలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. వాటిని రాజధాని కోసం వినియోగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మిలీనియం టవర్స్ ని సెక్రటేరియేట్ కోసం ఎంపిక చేసినట్టు సాగుతున్న ప్రచారం సందిగ్ధంగా మారుతోంది. ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్ ని సీఎం క్యాంప్ ఆఫీసుగా ఖరారు చేస్తున్నారనే కథనాల నేపథ్యంలో ఇక సెక్రటేరియేట్ వ్యవహారం ఎప్పటికీ స్పష్టత వస్తుందన్నది చూడాల్సిన అంశం. అదే సమయంలో ఉగాదికి రాజధానిగా ముహూర్తం ఖారారయినట్టు కనిపిస్తున్న తరుణంలో ఈ విషయం ఆసక్తిగా మారుతోంది.