Idream media
Idream media
తమ ప్రజల సంక్షేమం, రక్షణ కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కన్నా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారన్న విషయం వైసిపి సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఇప్పటికే దేశం మొత్తం తెలిసింది. తాజాగా ఆ విషయం మరోమారు లాక్ డౌన్ సమయంలో రుజువైంది. వలస కూలీలు, కార్మికులు వారి వారి స్వస్థలాలకు చేర్చాలి అంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గ నిర్దేశం చేసిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ లోని వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ మేరకు చర్యలు చేపట్టింది. నోడల్ అధికారిని నియమించి వలస కూలీలు కార్మికులను రాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
రాష్ట్రం వెలుపల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఓ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 0866 2424680 కి ఫోన్ చేసి ఎవరైనా తమ పేరు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ నెంబర్ చెబితే చాలు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి వారిని వారి వారి స్వగ్రామాలకు తీసుకురానుంది.
రాష్ట్రం వెలుపల ఉన్న వలస కూలీలు, కార్మికులతో పాటు విద్యార్థులు, యాత్రికులను కూడా తీసుకురావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఒరిస్సా రాష్ట్రం తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు లక్షల సంఖ్యలో ప్రజలు వెళ్లారు. దాదాపు నలభై రోజులుగా లాక్ డౌన్ వల్ల వలస కూలీలు కార్మికులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
స్వగ్రామాలకు వెళ్లేందుకు అవకాశం రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 0866 2424680 కి ఫోన్ చేసి తమ వివరాలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా 1902 కాల్ సెంటర్ కు ఫోన్ కనెక్ట్ అవుతుందని, ఫోన్ చేసే వారి ఎక్కడున్నారు, వారు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు, ఫోన్ నెంబర్ చెబితే సరిపోతుందని నిన్న ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు.
అయితే ఒక నెంబర్ మాత్రమే ఏర్పాటు చేయడంతో సదరు నెంబరు నిత్యం ఎంగేజ్ వస్తుంది. లక్షల సంఖ్యలో ఉన్న ప్రజలు ఒకేసారి ఫోన్ చేయడం ప్రారంభించడంతో ఫోన్ ఎంతకీ కలవడం లేదు. పదే పదే కాల్ చేసినా కలవకపోవడం తో వలస కార్మికులు, కూలీలు తీవ్ర నిరుత్సాహం లో ఉన్నారు. రాష్ట్రం వెలుపల కూలీలు కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో హెల్ప్ లైన్ నెంబర్ ల సంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. సంబంధిత అధికారులు అధిక సంఖ్యలో ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.