iDreamPost
android-app
ios-app

వెండితెర అల్లరి చిన్నారి ‘సిసింద్రి’ – Nostalgia

  • Published Apr 08, 2020 | 6:29 AM Updated Updated Apr 08, 2020 | 6:29 AM
వెండితెర అల్లరి చిన్నారి ‘సిసింద్రి’ – Nostalgia

సాధారణంగా చిన్న పిల్లలతో సినిమాలు చేయడం చాలా రిస్క్. కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడం దర్శకులకు కత్తి మీద సవాల్ గా ఉంటుంది. ఊహ తెలిసిన చిన్నారులతో ఓకే కానీ బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మానాన్నలనే ప్రపంచం అనుకునే బుడతలతో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. అందుకే ఇలాంటి కథలు రాసుకునేటప్పుడే రచయితలు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు పాపం పసివాడు సినిమాను తీసుకుంటే అందులో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపిస్తాడు. కారణం వయసు పది దాకా ఉండటం, అవతలి వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం చేసుకునే స్థాయి పొందటం.

పసివాడి ప్రాణంలో నటించిన బేబీ సుజిత చాలా చిన్న వయసే అయినప్పటికీ అప్పటికే హావభావాలు పలికించే స్టేజిలో ఉండటంతో కోదండరామిరెడ్డి గారి పని సులువైపోయింది. బేబీ షామిలి నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ అలా నిలిచిపోయాయంటే తన నటనతో పాటు చాలా క్యూట్ గా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. కాని ఇవన్ని ఒక ఎత్తు అయితే 1995లో వచ్చిన సిసింద్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అక్కినేని మూడో తరం వారసుడిగా నాగార్జున-అమల దంపతులకు 1994లో పుట్టిన అఖిల్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేయాలనే ఆలోచన ముందు ఆ కుటుంబంలో లేదు. ఆ సమయంలో హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీస్ డే అవుట్ రీమేక్ ప్రతిపాదన అన్నపూర్ణ సంస్థ వద్దకు వచ్చింది. దీన్ని అఖిల్ తో చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చలు తీవ్రంగానే జరిగాయి. ఎందుకంటే అప్పటికి అఖిల్ కేవలం ఏడాది వయసు దాటిన బుడ్డడు. మాటలే సరిగా రాని ఆ లేత వయసులో కెమెరా ముందు నిలబడగలడా అనే సందేహం అందరి మనసుల్లోనూ ఉంది.

కాని దర్శకులు శివనాగేశ్వర్ రావు గారు చాలా నమ్మకంగా ఉన్నారు. తనకు ఇచ్చిన బాద్యతను నెరవేర్చగలనన్న కాన్ఫిడెన్స్ నాగ్ ని ఆకట్టుకుంది. తన స్వంతంగా నిర్మించేందుకు రెడీ అయ్యారు. కేవలం మెయిన్ పాయింట్ గా మాత్రమే ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకుని తెలుగుకు అనుగుణంగా మార్పులు చాలా చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. సెట్ లో నిత్యం అమల గారు ఉండేలా, నాన్న నాగార్జున కూడా సినిమాలో భాగమైతే బాగుంటుందన్న ఉద్దేశంతో రాజా అనే మెకానిక్ పాత్రను ప్రత్యేకంగా సృష్టించారు. మిగిలిన తారాగణం మొత్తం భారీగా సెట్ అయిపోయింది.

అయితే అనుకున్నంత సులువుగా వ్యవహరం నడవలేదు. కొన్ని సార్లు సింగల్ షాట్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. నటన రక్తంలోనే ఉంది కాబట్టి అఖిల్ కొన్నిసార్లు మొండికేసినా అమ్మ సహాయంతో కోరుకున్న అవుట్ పుట్ ఇచ్చేశాడు. తెరమీద అమ్మానాన్నగా ఆమని, శరత్ బాబు నటించగా అఖిల్ ని కిడ్నాప్ చేసి నవ్వులు పూయించే విలన్ గ్యాంగ్ గా గిరిబాబు, సుధాకర్, తనికెళ్ళ భరణి తమ అనుభవంతో సన్నివేశాలను నిలబెట్టారు. శివాజీరాజాని సీరియస్ విలన్ గా చూపించి దాన్నీ వర్క్ అవుట్ చేసుకున్నారు. కథ కూడా బాగుంటుంది. ఆస్తి కోసం సిసింద్రిని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. వాడిని దాచలేక నానా తంటాలు పడుతున్న టైంలో మెకానిక్ రాజా అండతో సిసింద్రి తన అమ్మానాన్న దగ్గరకు తిరిగి ఎలా చేరుకున్నాడనే పాయింట్ తో చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది స్క్రీన్ ప్లే.

సిసింద్రి విజయంలో కీలక పాత్ర పోషించింది ఎంటర్ టైన్మెంట్. చాలా సరదాగా సాగుతూ ఇంత చిన్న పిల్లాడితో ఎలా చేయించారని ఒక పక్క ఆశ్చర్యపోతూనే బోలెడన్ని నవ్వులతో పాటు రాజ్ సమకూర్చిన పాటలు ఇంకో మెట్టు పైన నిలబెట్టాయి. ముఖ్యంగా ‘చిన్ని తండ్రి నిను చూడగా వేయి కళ్ళైనా సరిపోవురా’ అంటూ సిరివెన్నెల సాహిత్యంలో కంపోజ్ చేసిన పాట అప్పట్లో ప్రతి ఇంట్లో మారుమ్రోగిపోయింది. ‘ఆటాడుకుందాం రా’, ‘హలో పిల్లా’ పాటలు మాస్ కి బాగా ఎక్కేశాయి. మ్యూజికల్ గా సైతం సిసింద్రి అందుకున్న విజయం రాజ్ కు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది. సిసింద్రిగా అంత చిన్న వయసులో అఖిల్ చేసిన రిస్కులు, సాహసాలు ఇప్పుడు చూసినా అబ్బురపడటం ఖాయం.

తాత అక్కినేని నాగేశ్వర్ రావు గారు అతిధిగా ఓపెనింగ్ జరుపుకున్న సిసింద్రి ఆయన ఆశీర్వాదంతోనే ఘన విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత అఖిల్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎందులోనూ చూపించే ప్రయత్నం చేయలేదు నాగ్. ఇప్పుడు యూత్ స్టార్ గా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయినా అమ్మానాన్నల అందం పుణికిపుచ్చుకుని వచ్చిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో గట్టి హిట్టు కొడతాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.