iDreamPost
iDreamPost
నిన్న సాయంత్రం డివివి దానయ్య నిర్మాతగా చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. మూడు సినిమాలు సెట్ల మీద ఉండగా నాలుగోది ప్రకటించేయడం ఇటీవలి కాలంలో ఏ స్టార్ హీరో వల్ల కాలేదు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈ లిస్టులోకి రాదు కానీ దానికీ కొన్ని రీ షూట్లు జరుగుతున్నాయని అందులో చిరు పాల్గొంటున్నారని ఫిలిం నగర్ టాక్. భీష్మ సూపర్ హిట్ తర్వాత వెంకీ కుడుములు చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఓ హీరోతో ప్లాన్ చేసుకున్నా ఎందుకో అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఫైనల్ గా ఇలా మెగా కాంపౌండ్ లో లాక్ అయ్యాడు.
అరవై ఆరేళ్ళ వయసులో చిరంజీవి చూపిస్తున్న దూకుడు మాములుగా లేదు. ఎప్పుడో 1984 టైంలో ఒకే ఏడాది పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన ఘనత అందుకున్న చిరు ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఫీట్ చేయలేకపోయారు. క్రమంగా ఆ కౌంట్ మూడు నుంచి ఒకటికి పడిపోయింది. సైరా వచ్చి కూడా మూడేళ్లు దాటేసింది. మరి ఇప్పటికిప్పుడు ఇంత వేగం ఎందుకు చూపిస్తున్నారనే అనుమానం రావడం సహజం. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్లు, వందల కోట్ల ఖర్చు లేకుండా, విదేశాలకు వెళ్లే అవసరం పెద్దగా రాకుండా ఉండే కథలనే ఆయన ఓకే చేస్తున్నారట. దీనివల్ల సమయంతో పాటు నిర్మాత డబ్బు కూడా అదా అవుతుంది.
నిజానికి దానయ్య బ్యానర్ లో చిరు త్రివిక్రమ్ కాంబో అనే ప్రచారం మొదట జరిగింది. కానీ ఇప్పట్లో ఇది సాధ్యం కాకపోవడంతో స్వయానా త్రివిక్రమే శిష్యుడు వెంకీ కుడుములను రికమండ్ చేసి సెట్ చేశారని వినికిడి. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న వెంకీని చిరు నమ్మడానికి రీజన్ ఇదే ఉండొచ్చు. ఈ లెక్కన 2022లో చిరంజీవి సినిమాలు ఈజీగా రెండు లేదా మూడు రిలీజవుతాయి. మూడోది వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి తోడు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లతో వీలైనన్ని సినిమాలు చేసి త్వరగా 175 మార్క్ అందుకోవాలనే ఆలోచన కూడా మెగాస్టార్ కు ఉందని తెలిసింది. సులభమైతే కాదు కానీ ఈ స్పీడుతో అసాధ్యం మాత్రం కాదు
Also Read : Khiladi : గెట్ రెడీ “మాస్ మహారాజా” ఫాన్స్..ఖిలాడీ వస్తున్నాడు.