iDreamPost
android-app
ios-app

అందుబాటులో ఓ ‘‘టీకా’’ ఉంది

  • Published Oct 12, 2020 | 9:27 AM Updated Updated Oct 12, 2020 | 9:27 AM
అందుబాటులో ఓ ‘‘టీకా’’ ఉంది

.. అవును నిజమేనండీ మనందరికీ అందుబాటులోనే ఒక టీకా ఉంది. టీకా అంటే సూదితో గుచ్చి శరీరంలోకి పంపించే మందు కాదండోయ్‌.. అదే మాస్క్‌.
నోటికి, ముక్కుకూ అడ్డుగా పెట్టుకోవడం ద్వారా కోవిడ్‌ నుంచి 99శాతానికిపైగా రక్షణ కలిగించే ఆయుధం ఇదే. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంతా కోవిడ్‌ నియంత్రణకు అత్యంత కీలకమైన మూడు విషయాల్లోనూ మాస్క్‌దే అగ్రస్థానంగా చెప్పుకొస్తున్నారు. భౌతికదూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేవి మిగిలిన రెండూనూ. అన్‌లాక్‌ 5.0 సడలింపుల మేరకు ప్రస్తుతం అన్నీ తెరుచుకోనున్నాయి.

… సో ఈనెల 15వ తేదీ నుంచి దాదాపుగా జనం సాధారణ పరిస్థితులకు అలవాటుపడాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో కోవిడ్‌ భారిన పడకుండా మాస్కే శ్రీరామరక్షగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ నీలంసాహ్ని కూడా ఉత్తర్వులు జారీ చేసారు. జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలు, స్కూల్స్, కాలేజీలు, షాపింగ్‌మాల్స్‌ తదితర ప్రాంతాల్లో మాస్క్‌ లేకపోతే లోనికి అనుమతించొచ్చని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి ప్రదేశాల్లో శానిటైజేషన్‌ ప్రక్రియను చేపడుతూనే, భౌతికదూరం కూడా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖాధికారులు, కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసారు.

అంతే కాకుండా మాస్క్‌ ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను గురించి విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. వివిధ పండుల కారణంగా జనం గుమిగూడేందుకు అక్టోబరు నెల నుంచి అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో అవగాహన పెంచాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వాడని వారికి స్థానిక పరిస్థితులను బట్టి జరిమానాలు కూడా విధించాలన్నారు. అలాగే కోవిడ్‌ భారిన పడకుండా ఉండేందుకు సమగ్రంగా ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలను వివరించి వాటిని తు.చ. తప్పకుండా అమలు చేయాలని ఆదేశించాలు జారీ చేసారు.

ఇదిలా ఉండగా ఇళ్ళలోనే తయారు చేసిన దళసరిపాటి గుడ్డ మాస్కులు కూడా సమర్ధవంతంగానే పనిచేస్తాయని ఇప్పటికే వైద్య నిపుణులు తెలియజేసారు. వీటిని వినియోగించిన తరువాత వేడినీటిలో సర్ఫ్‌ వేసి తగు విధంగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరికీ ఎన్‌95 మాస్కుల అవసరం ఉండదని తేల్చారు. పదేళ్ళలోపు చిన్నారులు, అరవయ్యేళ్ళు పైబడిన వృద్ధులకు సర్జికల్‌ మాస్కు వినియోగించాలని సూచించారు.

కాగా మాస్కు ధరించే విధానంపై కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులంటున్నారు. మాస్కును ధరించిన తరువాత తరచు చేతులతో తాకడం చేయరాదంటున్నారు. ఇతర చోట్ల తాకిన చేతులతో మాస్కును తాకరాదని సూచిస్తున్నారు. అలాగే జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో మాస్కుతీసి మాట్లాడడం వంటివి చేయరాదంటున్నారు. మాస్కును గెడ్డాని వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని గుర్తించాలంటున్నారు. దీంతో పాటే భౌతికదూరం పాటించడం, చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

టీకా వచ్చేందుకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందుకోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. టీకా వచ్చేలోపు టీకాలాగే మనల్ని సురక్షితంగా ఉంచేందుకు మాస్కు ఉపయోగపడుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సక్రమంగా మాస్కును వినియోగించి కోవిడ్‌ భారిన పడకుండా ఎవరికి వారు రక్షణ పొందాలంటున్నారు.