iDreamPost
android-app
ios-app

Marakkar Report : మరక్కార్ అరేబియా సముద్ర సింహం రిపోర్ట్

  • Published Dec 03, 2021 | 10:24 AM Updated Updated Dec 03, 2021 | 10:24 AM
Marakkar Report : మరక్కార్ అరేబియా సముద్ర సింహం రిపోర్ట్

నిన్న అఖండ ఉన్నందుకు తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన మరక్కార్ అరేబియా సముద్ర సింహం ఇవాళ థియేటర్లో అడుగు పెట్టింది. క్యాస్టింగ్ గ్రాండ్ గా ఉన్నా నిర్మాతల పబ్లిసిటీ లోపం వల్ల అధిక శాతం సామాన్య ప్రేక్షకులకు ఇది వచ్చిందన్న సంగతి కూడా పెద్దగా తెలియకుండా పోయింది. పైగా అఖండ మాస్ మేనియాలో ఇది ఎంతవరకు మనుగడ సాగిస్తుందోనన్న అనుమానాలు లేకపోలేదు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ గ్రాండియర్ లో కీర్తి సురేష్, యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, సుహాసిని లాంటి పేరున్న తారాగణం చాలా ఉంది. ప్రియదర్శన్ దర్శకులు కావడంతో అంచనాలు ఉన్నాయి. రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం

ఇది 16వ శతాబ్దంలో జరిగిన కథ. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పోర్చుగీస్ శరణార్థులు దురాక్రమణలో స్థానిక రాజ్యాలను స్వాధీనం చేసుకుని దురాగతాలకు తెగబడతారు. ఈ క్రమంలోనే కుంజలి మరక్కార్(మోహన్ లాల్)కుటుంబం వాళ్లకు బలవుతుంది. తృటిలో తప్పించుకున్న మరక్కార్ అడవిలోకి పారిపోయి దొంగగా మారతాడు. ఉన్నవాడిని దోచి లేనివాడికి పంచు సిద్ధాంతాన్ని అనుసరించి పేదలకు దేవుడవుతాడు. తన వాళ్ళను పొట్టనపెట్టుకోవడమే కాక దేశానికి చీడపురుగుల్లా మారిన పోర్చుగీస్ అంతానికి ప్రతిన బూనుతాడు. మరి తను పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, అతని ప్రయాణం చివరికి ఏమయ్యింది తెరమీద చూడాలి.

విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన మరక్కార్ లో టెక్నికల్ అంశాలు అద్భుతంగా కుదిరాయి. బాహుబలినో హాలీవుడ్ మూవీస్ నో స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ సాంకేతిక విభాగాలు పనిచేసిన తీరు ప్రశంసనీయం. అయితే అసలైన కథా కథనాల విషయంలో మాత్రం అంత అనుభవమున్న దర్శకుడు ప్రియదర్శన్ తడబడ్డారు. పాత్రలు ఎక్కువ కావడంతో పాటు వాటికి సరైన ఎస్టాబ్లిష్మెంట్ లేక విపరీతమైన అయోమయానికి గురి చేస్తాయి. ఎమోషనల్ గానూ క్యారెక్టర్స్ ఆకట్టుకోవు. కీర్తి సురేష్ లాంటి వాళ్ళు వృథా అయ్యారు. లాజిక్స్ కూడా మిస్ చేశారు. మోహన్ లాల్ నటన నిరాశపరచనప్పటికీ మిగిలిన అంశాలు మరక్కార్ ని రికమండ్ చేయలేని విధంగా మార్చేశాయి

Also Read : Shekar : యాంగ్రీ మ్యాన్ సినిమా విడుదలకు మంచి ఆప్షన్