Idream media
Idream media
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.2008లో అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన తరువాత, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌కు ముందు కర్ణాటక కుర్రవాడు మనీష్ పాండేని ముంబై ఇండియన్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్-2008లో రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.అయితే ఐపీఎల్ -2009 సీజన్‌లో తన స్వరాష్ట్ర ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మనీష్ పాండే ఎంపికయ్యాడు. అతను తన అండర్ -19 సహచరులు విరాట్ కోహ్లీ మరియు శ్రీవాట్స్ గోస్వామిలతో కలిసి ఆర్‌సిబి జట్టులో చేరాడు.
ఐపీఎల్-2009 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ యొక్క మొదటి 11 మ్యాచ్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడం మూలంగా పాండేకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అప్పటికే ఆర్‌సిబి జట్టులో చాలా మంది స్టార్ బ్యాట్స్‌మెన్‌లు ఉండడంతో పాండే అవకాశాల కోసం వేచి ఉండాల్సి వచ్చింది.చివరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై పాండేకి ఆడే అవకాశం లభించినప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ 2009 మే 21న సెంచూరియన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండే సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా ఐపిఎల్ చరిత్ర పుస్తకాలలో తన పేరును నమోదు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ Vs డేర్‌డెవిల్స్:
ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలవవలసిన మ్యాచ్. కాగా పాండే ఇచ్చిన సింపుల్ క్యాచ్ ని ఆర్పీ సింగ్ థర్డ్ మ్యాన్ రీజియన్ వద్ద వదిలేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఒత్తిడికి గురైన అతను మూడవ ఓవర్‌లో తనకు లభించిన లైఫ్ ను సద్వినియోగం చేసుకొని దక్కన్ చార్జర్స్ భారీ మూల్యం చెల్లించేలా బ్యాటింగ్ చేశాడు.
ఆర్‌సిబి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్‌లు ముగిసే సమయానికి పాండే 18 బంతులలో 16 పరుగులు చేశాడు. అతని ప్రారంభ భాగస్వామి జాక్వెస్ కాలిస్ రెండవ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే కొన్ని భారీ షాట్లు ఆడి పాండేపై కొంత ఒత్తిడిని తగ్గించాడు.పాండే ఏడవ ఓవర్‌లో జస్కరన్ సింగ్ బంతిని బ్యాక్ ఫుట్‌పై బౌండరీ కొట్టి బ్యాటింగ్ లయ అందుకున్నాడు. పదో ఓవర్‌లో వాన్ డెర్ మెర్వే ఔట్ తర్వాత బెంగళూరును భారీ స్కోరు దిశగా నడిపే బాధ్యతను పాండే తీసుకున్నాడు.
ఒక ఎండ్‌లో వికెట్లు పడిపోతున్న మరో ఎండ్‌లో మనీష్ పాండే చార్జర్స్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి 10 ఓవర్‌లలో రాయల్ చాలెంజర్స్ 106 పరుగులు సాధించగా,అందులో 80 పరుగులు పాండే ఒక్కడే చేశాడు. ఇక అతను తిరుమల శెట్టి సుమన్‌ను బౌలింగ్ చేసిన 11 వ ఓవర్‌లో వరుసగా సిక్స్‌లు కొట్టి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అలాగే జస్కరన్ బౌల్ చేసిన ఇన్నింగ్స్ 16 వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో అతని వ్యక్తిగత స్కోరు 97 పరుగులకు చేరింది.ఇది 18 వ ఓవర్ చివరి డెలివరీకి పాండే తన సెంచరీని పూర్తి చేసి, ఐపీఎల్‌లో తొలి భారత శతక వీరుడుగా నిలిచాడు.
ఇన్నింగ్స్ చివరకు విరాట్ కోహ్లీ 9 బంతులలో రెండు సిక్స్‌లతో అజేయంగా 19 పరుగులు చెయ్యగా,పాండే అజేయంగా 73 బంతులలో 114 పరుగులు చేశాడు.ముఖ్యంగా పాండే లెగ్ సైడ్ అద్భుతమైన స్వీప్ షాట్లను ఆడాడు. పైగా అతని నాలుగు సిక్స్‌లు డీప్ మిడ్ వికెట్ లేదా లాంగ్ ఆన్ మీదుగా కొట్టాడు. 171 పరుగుల లక్ష్య ఛేదనలో హెర్షెల్ గిబ్స్ 43 బంతులలో 60 పరుగులు చేసినప్పటికీ దక్కన్ చార్జర్స్ నిర్ణీత 20 ఓవర్‌లలో 158 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో పాండే 35 బంతులలో 48 పరుగులు సాధించాడు. దక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన ఫైనల్‌లో పాండే కేవలం 4 పరుగులకు ఔట్ కాగా, బెంగళూరు మ్యాచ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది.
ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా స్థానం పొందుతున్న పాండే 130 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు.ఇందులో మనీష్ 29.31 బ్యాటింగ్ సగటుతో 2843 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వన్డే మ్యాచ్‌లలో ఒక సెంచరీ,రెండు అర్థ సెంచరీలతో 492 పరుగులు చెయ్యగా, 37 టి-20 లలో 40.13 సగటుతో 707 పరుగులు సాధించాడు.