Idream media
Idream media
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేని ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌ను కోరింది. ఈ రోజు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కోరింది. నేటి కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ దూరంగా ఉన్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ నేతృత్వంలో మహా అఘాడీ ప్రభుత్వం నవంబర్ 28న అధికారం చేపట్టింది.
భాగస్వామ్య పక్షాల రాజకీయ అవగాహన ప్రకారం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూటమి తరఫున 2019 నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆ సమయంలో ఆయన 288 (+1నామినేటెడ్) మంది ఎమ్మెల్యేలు గల శాసనసభలో గాని, 78 మంది సభ్యులు గల శాసనమండలిలో గాని సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారము ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఉభయ సభలలో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. అలా వీలుకాని పక్షంలో పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ ఎఫెక్టుతో రాజ్యసభ ఎన్నికలు,పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలతో పాటు మహారాష్ట్రలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ ఉద్ధవ్ ఠాక్రే ఆరు నెలల గడువు మే 28వ తేదీకి పూర్తవుతుంది.ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో విధాన పరిషత్తుకు ఎంపిక చేయాలని రాష్ట్ర క్యాబినెట్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కోరింది. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ ఎమ్మెల్సీగా నియమించకపోయినా, గడువులోపల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి సభ్యుడిగా ఎంపిక కాని పక్షంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది.