iDreamPost
android-app
ios-app

బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన కమల్ నాథ్

బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన కమల్ నాథ్

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కి షాక్ ఇస్తూ బెంగుళూరు క్యాంపులో ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ బలం 92 కి పడిపోయింది. సభలో ప్రస్తుత బలబలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 22 మంది, బిజెపికి చెందిన ఒక సభ్యుడి రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 207 కి పడిపోయింది. దీనితో ప్రస్తుత బలబలాలను బట్టి మ్యాజిక్ ఫిగర్ కి 104 మంది సభ్యులు అవసరం కాగా బిజెపి కి సొంతంగానే 107 మంది సభ్యుల బలం ఉండడంతో ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మార్గం సుగమమైంది.  

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ జరగనున్న బలపరీక్షలో చాలినంత బలం లేకపోవడంతో విస్వాస పరీక్షలో ఓటమి తప్పదని అంచనాకు వచ్చిన కమల్ నాధ్ బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కమల్ నాథ్ నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖ ను గవర్నర్ చేతికి అందించనున్నట్టు సమాచారం.

రాజీనామా నిర్ణయం ప్రకటించడానికి ముందు కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన కమల్ నాద్ తన 15 నెలల పాలనలో రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందించానని, రాష్రాభివృద్దికోసం చిత్తశుద్ధితో కృషి చేశానని చెప్పారు. 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం చెయ్యలేని పనిని తాను కేవలం 15 నెలల్లో చేసి చూపించానని ఆయన తెలిపారు. తనకు వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి కుట్ర చేసిందని, అత్యాశాపరులైన తమ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దఎత్తున డబ్బు, పదవులు ఎర చూపి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి అక్రమంగా క్యాంప్ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని కమల్ నాథ్ ఆరోపించారు.