iDreamPost
iDreamPost
గత కొన్నేళ్లుగా అంతర్గతంగా వ్యవహారంగా ఉండాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక సంవత్సరాలు గడిచే కొద్దీ రగడలకు వేదికగా మారడం చూస్తున్నాం. ఈసారి కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమలు నువ్వా నేనా అనే రీతిలో తలపడటం జనం ఆసక్తిగా చూస్తున్నారు. మొన్న ఒక ప్యానెల్ మీటింగ్ పెడితే నిన్న మరో బృందం ప్రెస్ ని పిలిచి వివరణ ఇచ్చింది. ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనం పక్కనపెడితే టీవీ న్యూస్ ఛానల్స్ మాత్రం తమ ప్రైమ్ టైం ఫీడింగ్ కోసం ఆర్టిస్టులను పిలిచి రేటింగులు రావాలని డిబేట్లు చేసి పండగ చేసుకుంటున్నాయి.
దీనికి కారణం ఎవరా అని విశ్లేషిస్తే మొదట్లో లేని ఈ కుమ్ములాటలు మొగ్గలోనే తుంచే అవకాశాన్ని వదిలేసిన పెద్దవాళ్లనే చెప్పాలి. ఫలానా పేరు చెప్పడం ఎందుకు కానీ గుట్టు దాచే సాంప్రదాయం మాలో కొంత కాలం నుంచే వెళ్లిపోయింది. మీడియా మైకుల ముందుకు వచ్చాక ఇక ఎవరిని నిందించి లాభం లేదు. స్వీయ విశ్లేషణ చాలా అవసరం. పట్టుమని వెయ్యి మంది కూడా లేని ఒక సంఘం ఎన్నికలు మీడియాలో టాప్ టాపిక్ గా ఎందుకు నిలవాల్సి వచ్చిందనే దాని గురించి అందరూ చర్చించాలి. ఎంతసేపు ఓటు వేస్తే అయిపోతుందనే కొందరి ధోరణి వల్ల సమస్య పరిష్కారం కాకుండా అంతకంతా పెరుగుతూనే పోతోంది.
సరే ఇప్పుడు ఫైనల్ గా ఎవరు పోటీలో ఉంటారు ఎవరు వెనక్కు తగ్గుతారో ఎవరో ఒకరు గెలవడం నిజం. కానీ ఇకపైనైనా ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. నిజానికి టాలీవుడ్ లో ఐక్యత గురించి ఇండస్ట్రీ వర్గాల్లోనే చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాడు. ఈ విబేధాలు అన్ని చోట్ల ఉండేవే అయినా హిందీ పరిశ్రమలో ఇంత తీవ్రత కనిపించదు. తమిళ తెలుగులో మాత్రమే ఇలా రచ్చచేసే పోకడ దర్శనమిస్తుంది. దానికి తోడు మా ప్రెసిడెంట్ అంటే ఏదో దేశానికి ప్రెసిడెంట్ అనే తరహాలో పబ్లిసిటీ జరగడం కూడా మంచిది కాదు. కాకపోతే ఎవరో ఒకరు చొరవ తీసుకుని బ్రేక్ వేయాలి.