Idream media
Idream media
యువరాజు పట్టాభిషేకం జరిపించుకునే వయస్సుకి వచ్చినప్పుడు అతని తండ్రి అయిన రాజు అతన్ని కొన్ని రోజులు దేశాటనం చేసి రమ్మని పంపడం గురించి చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. ఇప్పుడు కూడా అపర కుబేరులైన వ్యాపార వేత్తలు కొందరు తమ బాధ్యతలు అప్పగించే ముందు తమ వారసులని పైసా ఇవ్వకుండా స్వయంశక్తితో కొద్ది రోజులు బయటి ప్రపంచంలో గడిపిరమ్మని పంపడం గురించి వార్తల్లో చూస్తుంటాం. ఎప్పుడూ అంతఃపురాల్లో, ఆకాశ హర్మ్యాల్లో గడిపితే వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందో వారికి తెలియదని వారి తండ్రులు ఇలా చేస్తారు.
ఇప్పుడు రాజ్యాలు, రాజులూ పోయి, ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చినా వారసత్వ పాలన మాత్రం అంతరించలేదు. రాచరిక పాలనలో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే కొనసాగుతోంది.
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాబోయే సార్వభౌముడు లోకేష్ బాబు అన్నది ఏమాత్రం ఆలోచించినా ఎవరికైనా తట్టే విషయం. మొన్న ఎన్నికల్లో గెలిచి, తను కొన్ని రోజుల పాటు పాలించి, రాష్ట్రంలో పూర్తి అనుకూల వాతావరణం ఏర్పరచి కుమారుడికి పట్టాభిషేకం జరిపి, తెర వెనుక విశ్రాంతి తీసుకుంటూ, సలహాదారుడిగా కుమారుడు పాలనలో తగిన అనుభవం సాధించే వరకూ తెరవెనక ఉండి చక్రం తిప్పాలని చంద్రబాబు నాయుడు వేసుకున్న ప్రణాళికకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు దారుణంగా తూట్లు పొడిచారు.
పార్టీతో పాటు భావి సామ్రాట్టు కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పరాజయం చెందడం చంద్రబాబు వేసిన ప్రణాళికను తలకిందులు చేసింది. అయితే ఓటమి విజయానికి సోపానం అని భావించి, అంత పెద్ద ఓటమి నుంచి త్వరగా తేరుకుని ప్రతిపక్ష నాయకుడి పాత్ర సమర్ధవంతంగా పోషిస్తూ ఉంటే లోకేష్ బాబు జనంలోకి రాకుండా తన ట్విట్టర్ ప్రపంచంలో ఉండిపోయాడు.
ట్విట్టరే ప్రపంచం
మొదటి నుంచి లోకేష్ బాబు ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉండే వాడు. యువకుడు, టెక్నాలజీ నూతన పోకడలు తెలిసిన వాడు కాబట్టి అది సహజం అనుకున్నా, మైకుల ముందుకు అడపాదడపా వచ్చి మాట్లాడినప్పుడు దొర్లిన ఒకటిరెండు పొరపాట్లు సోషల్ మీడియా పుణ్యమా అని బాగా ప్రచారం పొందడంతో లోకేష్ బాబు ట్విట్టర్ మీద మరింత ఎక్కువగా ఆధారపడసాగాడు. తన అభిప్రాయాలు, ప్రత్యర్థుల మీద విమర్శలు అన్నీ ట్విట్టర్ లోనే వదిలేవాడు.
నేడో రేపో రాజు కావలసిన వాడు ఇలా ఉంటే బాగుండదని భావించిన చంద్రబాబు లోకేష్ బాబుకి తెలుగు నేర్పించి, అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేలా తయారు చేయడానికి ఒక శిక్షకుడిని ప్రభుత్వ సొమ్ముతో నియమించారు. ఆ శిక్షణ అలా సాగుతూ ఉండగానే ఎన్నికలు రావడం, తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావడం జరిగింది.
ఆ ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు తన వంతుగా తిరిగి ప్రచారం చేసినా బలమైన ముద్ర వేయలేకపోయాడు.
ఇప్పుడు శాసనమండలిలో సభ్యుడుగా ఉన్నా ఎప్పుడూ వార్తల్లో ఎక్కే స్థాయిలో తన గళం విప్పే అవకాశం రాలేదు. అలా అని ప్రజల్లో విస్తృతంగా తిరిగి, అధికార పక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా అతను ఎందుకో గట్టిగా చేయడం లేదు.
రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కూడా చంద్రబాబు తన వయసును కూడా మర్చిపోయి పోరాటం చేస్తుంటే, చంద్రబాబు పక్కన తనూ ఒక జోలె పట్టుకుని విరాళాలు సేకరించడం తప్ప బలమైన పాత్ర పోషించలేదు లోకేష్.
ట్విట్టర్ వదిలి ప్రజల మధ్యకు
దేశంలో, ప్రపంచంలో అనేక మంది రాజకీయ నాయకులు తమ భావాలను ట్విట్టర్ ద్వారా పంచుకొంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా. అయితే వీరందరూ ట్విట్టర్ తో పాటు ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. దానికి తోడుగా ట్విట్టర్ వాడుతారు కానీ, ట్విట్టర్ కే పరిమితమై ఉండరు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు, లోకేష్ బాబు అభిమానులు కోరుకునేది కూడా అదే. ట్విట్టర్ కి పరిమితమై పోకుండా ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేసి తమను నడిపించేలా తమ యువ నాయకుడు ఉండాలని.
పబ్లిక్ స్పీకింగ్ అనేది సైకిల్ తొక్కడం లాంటిది. పడుతూ లేస్తూ తొక్కుతూ ఉంటే అలవాటు అవుతుంది కానీ, పడిపోతామేమో అని భయపడి సైకిల్ ఎక్కకపోతే ఎప్పటికీ రాదు. లోకేష్ బాబు కూడా మరింత చురుగ్గా పార్టీ చేసే పోరాటాలకు నాయకత్వం వహించి, ప్రజల్లో మరింత ఎక్కువ కాలం గడపాలని తెలుగుదేశం కార్యకర్తల ఆకాంక్ష.