iDreamPost
iDreamPost
ఒకసారి గుర్తింపు వచ్చే వరకే ఇబ్బందులు..ఇక ఆ తర్వాత పాపులారిటీతో ఏం చేసినా చెల్లిపోతుందన్నది సహజంగా ఉన్న అభిప్రాయం. కానీ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమ జనం నోళ్లలో నానుతూ ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. రాజకీయ నేతలు, సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలలో చాలామందికి ఇది వర్తిస్తుంది. అందులో కొందరు తమ మాటలతో, ఇంకొందరు తమ చేతలతో, అత్యధికులు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాతో సెలబ్రిటీ స్టేటస్ కొనసాగిస్తూ ఉంటారు.
ప్రస్తుతం లాక్ డౌన్ వేళ అందరిలానే సెలబ్రిటీలకు కూడా సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా తమను అబిమానులు మరచిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే సినీ, స్పోర్ట్స్ స్టార్లను చూస్తున్నాం. తొలుత సహాయం పేరుతో నిధులు కేటాయించే విషయంలో ఒక్కొక్కరూ స్పందించారు. తమ అభిమతానికి అనుగుణంగా నిధులు అందించారు. ఆ తర్వాత సమాజానికి సందేశాలు ఇచ్చే పేరుతో ప్రయత్నాలు చేశారు. ఇక తాజాగా రకరకాల ఛాలెంజ్ లు చేస్తున్నారు. రియల్ మేన్ ఛాలెంజ్ అంటూ ఇంటిపనిలో భాగస్వామ్యం అవుతూ చేస్తున్న చిన్న చిన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చర్చనీయాంశాలవుతున్నారు. ఈ విషయంలో సినీ స్టార్స్ జోరుగా ఉన్నారు.
స్పోర్ట్స్ స్టార్స్, సెలబ్రిటీలు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అయితే వారు మాత్రం పాత జ్ఞాపకాలు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ తెరమీదకు వస్తున్నారు. ఆన్ లైన్ వీడియో ఛాటింగులతో చర్చనీయాంశాలవుతున్నారు. లాక్ డౌన్ వేళ కూడా జనం నోట్లే ప్రయత్నంలో రాజకీయ నేతలు నేరుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సినీ, స్పోర్స్ట్ స్టార్స్ కి భిన్నంగా నేరుగా క్షేత్రంలో పలువురు పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు. వారి అనుబంధ, అనుచర వర్గాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలకు చేరువయ్యామని చెప్పుకునేందుకు, ఆపదలో అండగా ఉన్నారని అంతా భావించేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇలాంటి సెలబ్రిటీ వ్యవహారాలే ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చకు అవకాశం ఇస్తున్నాయి. సహజంగానే మన సమాజంలో క్రైమ్, సినిమా, సెలబ్రిటీ అనే మూడు సీ ల ఆధారంగా మీడియా ఫోకస్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే లాక్ డౌన్ వేళ మీడియా కెమెరాల కళ్లన్నీ వారిపై ఉంటాయి. దానిని తప్పుబట్టే వాళ్లు కూడా లేకపోలేదు.
లాక్ డౌన్ తో కాలినడకన రోడ్డున పోతున్న వలసకూలీలు, గిట్టుబాటు లేక అల్లాడుతున్న రైతులను విస్మరించి ఈ వంటింటి వ్యవహారాలకు ప్రచారం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయినా జనాల దృష్టిలో పడేందుకు సెలబ్రిటీలు చేసే ప్రయత్నాలకు తగిన ప్రసార, ప్రచార బాధ్యతలు నిర్వహిస్తేనే తమకు కూడా రేటింగ్స్ వస్తాయనదే మీడియా సెలబ్రిటీల వాదన. దాంతో అసలు సమస్యలు మరుగునపడుతున్నాయని, అత్యధికులను విస్మరిస్తున్నారని కొందరు గోడు వెళ్లబోసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు మరో దారిలేదనే వారూ ఉన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఎవరి కష్టాలు వారి వన్నట్టుగా ఇప్పుడు సినిమాలు, ఆటలు అన్నీ నిలిచిపోయిన సమయంలో జనం నోళ్లలో నానే యత్నాలు అన్నీ ఇన్నీ కావు అన్నట్టుగా మారాయి. అలాంటి వారి కష్టాలను తక్కువ చేయడానికి లేదు. అందుకోసం పడుతున్న తపన, తాపత్రయం చిన్న విషయమే కాదు. మొత్తంగా కరోనా అందరినీ కలచివేస్తున్నట్టుగానే ప్రచారం కోసం పరితపించే వర్గాలను కూడా మనోవేధనకు గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. జనం కడుపునింపే మార్గాలు ఎలా ఉన్నా ఇలాంటి వారి ప్రచార యావ తీరేదన్నడూ అన్నది అర్థంకాకుండా ఉంది.