iDreamPost
android-app
ios-app

అమాన‌వీయ భార‌తం పిట్ట‌ల్లా రాలుతున్న వ‌ల‌స‌కూలీలు

  • Published Mar 31, 2020 | 4:53 AM Updated Updated Mar 31, 2020 | 4:53 AM
అమాన‌వీయ భార‌తం  పిట్ట‌ల్లా రాలుతున్న వ‌ల‌స‌కూలీలు

లాక్ డౌన్ త‌ర్వాతి ప‌రిణామాలు క‌ల‌చివేసే దిశ‌లో సాగుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల జీవితాల‌ను అత‌లాకుత‌లం చేసేసింది. ముఖ్యంగా వ‌ల‌స‌జీవుల‌ను ఇక్క‌ట్ల‌లోకి నెట్టింది. వారికి ప్రాణ‌సంక‌ట‌గామారింది. ఉన్న చోట ఉండేందుకు అవ‌కాశం లేక‌, సొంత ఊరికి వెళ్లేందుకు దారి తెన్నూ లేక త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఆ క్ర‌మంలో ఇప్ప‌టికే మార్గం మ‌ధ్య‌లో 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు భార‌తావ‌ని త‌ల‌దించుకోవాల్సిన స్థితిని చాటుతోంది.

మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూ, ఆవెంట‌నే లాక్ డౌన్ వంటి నిర్ణ‌యాల‌తో క‌నీసంగా 3వారాల పాటు రోడ్డుమీద‌కు కూడా అడుగుపెట్టే అవ‌కాశం లేకుండా పోయింది. దాంతో రెక్కాడితే గానీ డొక్కాడ‌ని బ‌డుగుల జీవితాల్లో బ‌డ‌బాగ్ని ర‌గులుకుంది. ఏం చేయాలో, ఎటుపోవాలో, ఎలా గ‌డ‌పాలో కూడా పాలుపోని స్థితిలో సొంతూళ్ల‌కు పోదామ‌న్నా ఛాన్స్ లేదు. దాంతో కాలిన‌డ‌క‌నే అనేక మంది వంద‌ల కిలోమీట‌ర్ల దూరాన్ని దాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో మార్గం మ‌ధ్య‌లో వారికి క‌నీసం తిండి దొరికే అవ‌కాశం కూడా లేదు. ఎక్క‌డైనా మాన‌వ‌త్వంతో స్పందించే వారు కాస్త తిండిపెడితే తిన‌డం, లేదంటే అలానే కాళ్లూడ్చుకుంటూ సాగ‌డం అన్న‌ట్టుగా మారింది. చివ‌ర‌కు ఢిల్లీలో రెండు రోజుల పాటు కొద్ది సంఖ్య‌లో వ‌చ్చిన బ‌స్సుల కోసం ఎగ‌బ‌డిన వారి సంఖ్య ఆందోళ‌న‌క‌రంగా మారింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తిని క‌ల‌వ‌ర‌ప‌రిచే ఆ సీన్ వెనుక క‌ష్ట‌జీవుల క‌న్నీటి ఛాయ‌లు చాలామందికి ప‌ట్ట‌డం లేదు. ఎలా అనుమ‌తిస్తారు అనే ప్ర‌శ్న వేస్తున్న వారు..వాళ్లు ఎలా జీవించాలి అనే ప్ర‌శ్న‌ను సంధించ‌లేక‌పోయారు. అదే ఇంత‌టి విప‌త్తుకి కార‌ణంగా మారింది. ప‌లువురి ప్రాణాలు గాలిలో క‌ల‌వ‌డానికి మూలం అయ్యింది.

ఇప్ప‌టికే 22 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ప‌రిశోధ‌క పాత్రికేయులు చెబుతున్నారు. వారిలో ఐదుగురు చిన్నారులు స‌హా 17 మంది కార్మికులు, వారి కుటుంబీకులు ఉన్న‌ట్టు చెబుతున్నారు.ఉత్త‌రాదిన ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌ర‌గ్గా, సోమ‌వారం తెలంగాణాలోని విక‌రాబాద్ స‌మీపంలో ఓ వ‌ల‌స కూలీలు కుప్ప‌కూలాడు. రోడ్డు మీద న‌డుస్తూనే ప్రాణాలు విడిచిన ఘ‌ట‌న చూస్తే ఎవ‌రికైనా క‌న్నీరు రాక‌మాన‌దు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ఆ కూలీ మ‌హారాష్ట్ర నుంచి తిరిగి సొంత ఊరికి వెళుతున్న క్ర‌మంలో ప్రాణం విడిచిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశం దుస్థితిని, అమాన‌వీయ విధానాల‌ను చాటుతున్నాయి. క‌నీసం వ‌ల‌స కూలీలు ఇళ్ల‌కు చేరే ఏర్పాట్లు గానీ, లేదంటే వారి ప్రాణాలు నిల‌బెట్టే చ‌ర్య‌ల‌ను గానీ స‌ర్కారు చేప‌ట్టలేక పోవ‌డంతో ఇప్పుడు రెండు ప‌దుల మంది అమాయ‌కులు మ‌ర‌ణించాల్సి వ‌చ్చింది. ఇంకెంత మందికి ఇలాంటి దుస్థితి దాపురిస్తుందో అని ఆలోచిస్తే మ‌రింత ఆందోళ‌న క‌ల‌గ‌డం ఖాయం. ఇప్ప‌టికైనా త‌గిన ఏర్పాట్లు చేసి సాటి భార‌తీయుడిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని ఆశిద్దాం.