లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అటవీ జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో క్రూర జంతువులతో పాటు అటవీ జంతువులు సంచారం రోడ్లపై ఎక్కువైంది.
తాజాగా హైదరాబాద్ నగరంలో చిరుత ఒకటి కలకలం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద గాయాలతో రోడ్డుపై పడిఉన్న చిరుతను స్థానికులు గమనించారు. కాలికి గాయమై కదల్లేని స్థితిలో ఉన్న చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ చిరుతను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత దాడి చేసే అవకాశం ఉండడంతో జాతీయ రహదారిపై వాహనాలను నియంత్రించారు పోలీసులు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జూపార్కు సిబ్బంది చిరుతను బంధించడానికి ప్రయత్నించగా ఓ వ్యక్తిని గాయపరచి సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించింది. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో చిరుతను బంధించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.