iDreamPost
iDreamPost
కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృశ్యా లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగింపునకు రంగం సిద్ధమైంది. మే 31 వరకూ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న 30 ప్రాంతాల్లో లాక్ డౌన్ 4.0 కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. మే నెల ప్రారంభంలో ఒకటో తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
నాలుగో తేదీన మరింత తక్కువుగా 3 మాత్రమే నమోదవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మే 11న రికార్డు స్థాయిలో 79 కేసులు నమోదు కావడం.. అవన్నీ హైదరాబాద్ లోనే ఉండడంతో అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా శనివారం 55 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటిలో 44 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కేసుల తీవ్రత ఇలా పెరుగుతూ ఉంటే.. ఆర్థిక వ్యవస్థ పతనం కావడం.. కేంద్రం ఇచ్చిన సండలింపుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెడ్ జోన్‌లో కూడా ప్రభుత్వ, కార్యకలాపాలు బాగా పెరిగాయి. లాక్ డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఉంటాయని ప్రచారం జరుగుతూనే.. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
లాక్ డౌన్ 4.0పై కేంద్రం ప్రకటన అనంతరం స్పందిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కరోనాతో కలిసి బతికే వ్యూహం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ వ్యూహం ఎలా ఉంటుంది..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఏంటో తెలియాలంటే రేపటి వరకూ వేచి ఉండాల్సిందే. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,680 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈరోజు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.