లాక్ డౌన్ రివ్యూ 10 – టైప్ రైటర్

అందరూ భయపడినట్టుగానే లాక్ డౌన్ మూడో వెర్షన్ మొదలైపోయింది. చాలా ప్రాంతాలు, కీలకమైన నగరాలు ఇంకా రెడ్ జోన్ లోనే ఉండటంతో ఆంక్షలు ఇంకొంత కాలం కొనసాగనున్నాయి. గ్రీన్ జోన్ లో సైతం మొత్తం ఫ్రీగా వదిలెయ్యలేదు కాబట్టి జనం ఇంకా బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. అందుకే ఇంట్లోనే కూర్చుని వినోదాన్ని అందించేందుకు డిజిటల్ సంస్థలు పోటీ పడుతున్నాయి ఈ నేపధ్యంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. కొన్ని నెలల క్రితం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన టైప్ రైటర్ హారర్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దాని రివ్యూ చూద్దాం

కథ

గోవాలోని బార్డెజ్ అనే ఊరవతల ఒక పాత విల్లాకి వస్తుంది జెన్నీ(పలోమి ఘోష్). అది ఆవిడ తాత ఆస్తి కావడంతో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటుంది. అదే ఊరిలో ఉన్న స్కూల్ లో చదువుతున్న సమీరా(ఆర్ణ శర్మ)ఫ్రెండ్స్ తో కలిసి ఘోస్ట్ క్లబ్ ఒకటి స్థాపించి దెయ్యాలను వెతికే పనిలో ఉంటుంది. కొద్దిరోజులు అయ్యాక విల్లాలో పని చేసేందుకు వచ్చిన మనిషితో పాటు జెన్నీతో పరిచయమున్న ఇంకొందరు దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు ఇన్స్ పెక్టర్ రవి(పురబ్ కోహ్లి). విచారణ చేసే కొద్ది ఆ హత్యల వెనుక విల్లాలోని ఒక టైప్ రైటర్ కారణమని తెలుస్తుంది. దీనికి సమీరా స్కూల్ టీచర్ అమిత్ రాయ్(జిస్సు సేన్ గుప్తా)కు ఏదో సంబంధం ఉంటుంది. అసలు విల్లాలోని రహస్యం ఏమిటి, ఈ హత్యల పరంపర ఎక్కడికి దారి తీసిందనేదే ఎన్నో ట్విస్టులతో కూడిన టైప్ రైటర్ స్టొరీ

నటీనటులు

ఇందులో నటీనటులందరికీ సమానమైన ప్రాధాన్యం దక్కింది. ముఖ్యంగా దెయ్యంగా, విల్లా వారసురాలిగా జెన్నీ డ్యూయల్ రోల్ లో సహజమైన లుక్ తో చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తర్వాత బాగా గుర్తుండిపోయేది ఘోస్ట్ లను చూసేందుకు తెగ తాపత్రయపడిపోయే స్కూల్ గర్ల్ గా నటించిన ఆర్ణ శర్మ. ఇంత చిన్న వయసులోలోనూ మెచ్యుర్డ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇన్స్ పెక్టర్ గా నటించిన పురబ్ కోహ్లీ కూడా బాగున్నాడు. మనకు అశ్వద్ధామతో విలన్ గా పరిచయమైన జిస్సు సేన్ గుప్తా పాత్రకు తగ్గ ఇంటెన్సిటీతో మెప్పించాడు. ప్రతిఒక్కరు తమ తమ రోల్స్ లో ఒదిగిపోవడం క్యాస్టింగ్ పరంగా టైప్ రైటర్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. మరో ముగ్గురు చిన్న పిల్లలు కూడా బాగా చేశారు.

డైరెక్టర్ అండ్ టీం

కహాని, బద్లా లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తో బాగా ఆకట్టుకున్న దర్శకుడు సుజయ్ ఘోష్ ఐదు ఎపిసోడ్లతో నాలుగు గంటల నిడివిని సాద్యమైనంత మేరకు ఎంగేజింగ్ గా చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారు. కథ పరంగా చూసుకుంటే ఇందులో మరీ కొత్తదనం అయితే లేదు. విల్లాలో దెయ్యమంటే మరీ రొటీన్ అయిపోతుందనే ఉద్దేశంతో టైప్ రైటర్ లో పెట్టడమనే పాయింట్ బాగానే ఉంది కానీ సిరీస్ మొదలైన ఓ రెండు ఎపిసోడ్ల తర్వాతా కథాక్రమం అంతా ఊహించినట్టే సాగిపోవడం ఇందులో ఉన్న ప్రధానమైన మైనస్. అలా అని మరీ తీసిపారేయదగ్గది కూడా కాదు. రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా దెయ్యాల కథలో నలుగురు చిన్నపిల్లలని ఇన్వాల్వ్ చేయడం బాగా సెట్ అయ్యింది. కానీ మరీ అంత పసివాళ్ళను దెయ్యాలను వెతికే పనిలో చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిగా అనిపించవచ్చు. విల్లా సెటప్, గోవా బ్యాక్ డ్రాప్ టైప్ రైటర్ కి బలంగా నిలిచాయి. ఎక్కువ సాగదీయకుండా సుజయ్ ఘోష్ తన టెక్నిక్ ని చక్కగా వాడి మరీ తీవ్రంగా నిరాశపరిచే జాబితాలో పడకుండా టైప్ రైటర్ ని కాపాడారు

చివరి మాట

హారర్ సినిమాలు, సిరీస్ రెగ్యులర్ గా చూసే అలవాటున్న ప్రేక్షకులకు టైప్ రైటర్ బ్యాడ్ ఛాయస్ గా నిలవదు. అక్కడక్కడా ల్యాగ్ ఉన్నా బిగిసడలని కథనంతో రొటీన్ స్టోరీనే ఎంగేజింగ్ గా చెప్పిన సుజయ్ ఘోష్ సిరీస్ ని ఐదు ఎపిసోడ్లకే దీన్ని పరిమితం చేయడం పెద్ద ప్లస్ పాయింట్. విపరీతంగా భయపెట్టి బెదరగొట్టే సీన్లు లేకుండా సింపుల్ గానే చెబుతూ హారర్ కన్నా థ్రిల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన టైప్ రైటర్ ని లాక్ డౌన్ ఫ్రీ టైంలో ట్రై చేయొచ్చు.

Show comments