iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 15 – రన్

  • Published May 31, 2020 | 12:58 PM Updated Updated May 31, 2020 | 12:58 PM
లాక్ డౌన్ రివ్యూ 15 –  రన్

ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటు లక్ కలిసివచ్చినప్పుడే ఎక్కువ గుర్తింపు వస్తుంది. అది లేని నాడు మనం పడ్డ కష్టం వల్ల వచ్చే ఫలితం తక్కువే. దీనికి ఉదాహరణగా నవదీప్ ని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటినా విజయాల శాతం తక్కువగా ఉండటంతో హీరో కన్నా ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ చాలా రోజుల క్రితమే వెబ్ సిరీస్ ల వైపు వచ్చేశాడు. ఈ క్రమంలో ఇటీవలే విడుదలైన ఇండిపెండెంట్ ఫిలిం రన్. ఆహా ప్లాట్ ఫార్మ్ ద్వారా రిలీజైన దీనికి యాప్ వాళ్ళు గట్టి పబ్లిసిటీనే ఇచ్చారు. మరి ఇదెలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

సందీప్(నవదీప్), శృతి(పూజిత పొన్నాడ)ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అన్యోన్య దంపతులు. సంవత్సరం తర్వాత సరిగ్గా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు శృతి హత్యకు గురవుతుంది. ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్(వెంకట్)కు సందీప్ మీదే అనుమానం వస్తుంది. కానీ అక్కడి నుంచి తప్పించుకుని అసలు హంతకుడిని పట్టుకోవడం కోసం సందీప్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. తనకు తోడు స్నేహితుడు(అమిత్ తివారి)కూడా సహాయపడతాడు. అనూహ్యంగా సందీప్ తో సంబంధం ఉన్న వాళ్ళ హత్యలు జరుగుతాయి. అసలు శృతి హంతకుడు ఎవరు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

ముందే చెప్పుకున్నట్టు నవదీప్ టాలెంట్ ని వంక పెట్టే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. కాకపోతే సరైన కథ దర్శకుడు ఇప్పటిదాకా దొరకలేదు అంతే. కృష్ణవంశీ చందమామ లాంటివి పేరు తెచ్చినా అంతగా లాభం లేకపోయింది. ఇక రన్ విషయానికి వస్తే గంటన్నర నిడివి ఉన్న ఈ ఇండిపెండెంట్ ఫిలింని మొత్తం తన భుజాల మీద మోశాడు. సైకాలజి డిజార్డర్ తో బాధ పడే పేషంట్ గా మంచి వేరియేషన్స్ ఇచ్చాడు. అయితే కొన్ని సీన్స్ లో మాత్రం ఓవర్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఇక పూజితా పొన్నాడ అందంగా చక్కగా ఉంది. కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం కావడంతో నటనకు అవకాశం దొరకలేదు. హీరో తర్వాత ఎక్కువ కనిపించే వెంకట్, అమిత్ తివారిలు తమకు చేతనైనంత చేశారు. షఫీ, ముక్తార్ ఖాన్, కౌసల్య, మనాలి రాధోడ్, మధునందన్, కిరీటి దామరాజు తదితరులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రధారులే

డైరెక్టర్ అండ్ టీమ్

హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అమ్మాయి చనిపోయి ఆ హత్యానేరం ఇతగాడి మీద పడటం అనే థీమ్ మీద ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. నాగార్జున క్రిమినల్, సుమన్ నేరం నాది కాదులతో మొదలుపెట్టి ఇంకా వెనక్కు హాలీవుడ్ లోనూ బోలెడు కనిపిస్తాయి. దర్శకుడు లక్ష్మికాంత్ చెన్నాకు ఇందులో అంత యూనిక్ పాయింట్ ఏమనిపించిందో అర్థం కాదు. దీనికి అపరిచితుడులోని మెంటల్ డిజార్డర్ కాన్సెప్ట్ ని జోడిస్తే చాలు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు అనుకున్నాడేమో కాబోలు మొత్తంగా పప్పులో కాలేశారు. నిడివి కేవలం 90 నిముషాలు మాత్రమే ఉన్నా రన్ ఎక్కడా గ్రిప్పింగ్ గా సాగదు.

ఏదో భలే ట్విస్టు ఇచ్చామనుకుని రాసుకున్న మలుపులు కూడా చాలా చోట్ల సిల్లీగా లాజిక్ కి దూరంగా సాగుతాయి. హీరో అంత విచిత్రంగా ప్రవర్తిస్తుంటే పోలీసులకు కించిత్ కూడా అనుమానం రాకుండా అతన్ని గుడ్డిగా ఫాలో కావడం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఒక్కో పాత్ర మీద అనుమానం వచ్చేలా చేసినంత మాత్రాన అది గొప్ప థ్రిల్లర్ అయిపోదు. దానికి కావాల్సిన టెంపో, ఎమోషన్ ని ఒక క్రమపద్ధతిలో పేర్చుకోవాలి. లక్ష్మికాంత్ ఈ విషయంలో పెద్దగా హోమ్ వర్క్ చేసినట్టు అనిపించదు. హత్య జరిగిన తర్వాత ప్రహసనం అంతా బోరింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ కు ముందు చేసిన హడావిడి కూడా నవ్వులపాలైంది. నరేష్ కుమరన్ సంగీతం సోసోనే. సజీశ్ రాజేంద్రన్ ఛాయాగ్రహణం బాగుంది. ఇక నిర్మాణ విలువల గురించి చెప్పడానికి ఏమి లేదు

చివరి మాట

ఎంత ఫ్రీ గా చూసే వెబ్ సిరీస్ అయినా ఇండిపెండెంట్ మూవీ అయినా ప్రేక్షకులను మరీ లోకువగా జమ కట్టకూడదు. ఇప్పుడు ప్రపంచ స్థాయి వినోదం వాళ్ళ అరచేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి మనకు తోచింది తీసి వాళ్లకు పాతవేం గుర్తుంటాయనే భ్రమలో రెండు మూడు కథలను కిచిడి చేసి ఇలా వండి వడ్డిస్తే తిరస్కారం తప్పదు. రన్ లో జరిగింది ఇదే. ఇంత తక్కువ నిడివి ఉన్నా సహనానికి పరీక్షగా నిలిచిందంటే అది ఖచ్చితంగా కథనంలోని లోపమే. ఇలాంటివి తప్పులు ఎలా చేయకూడదో చూపించడానికి ఉదాహరణగా పనికొస్తాయే తప్ప ఇంకేరకంగానూ ఆకట్టుకునే అంశాలు ఇందులో లేవు. అయినా పర్లేదు క్రైమ్ థ్రిల్లర్ అయితే చాలు ఎలా ఉన్నా చూస్తాం అనుకుంటే రన్ మీద ఒక ట్రయిల్ వేయొచ్చు. మీ స్వంత రిస్క్ మీదే సుమా.