అడ్డుగోడ‌ కూల్చారు సరే ..! కానీ గుంత‌లు?

ఏపీ, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లో క‌ల‌క‌లం రేపిన స‌రిహ‌ద్దులు చెరిగిపోయాయి. తమిళ‌నాడు అదికారులు 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే తాము నిర్మించిన గోడ‌ల‌ను తొల‌గించారు. దాంతో స‌మ‌స్య స‌ర్థుమణిగినందుకు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంత‌లోనే ఒడిశా స‌రిహ‌ద్దుల్లో గిరిజ‌న గ్రామాల ప్ర‌జ‌ల‌కు కొత్త స‌మ‌స్య ముందుకురావ‌డం విస్మ‌య‌క‌రంగా మారుతోంది.

చిత్తూరు, వెల్లూరు జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని ప‌లు చోట్ల త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రోడ్డుపై గోడ‌లు నిర్మించింది. స‌రిహ‌ద్దుల్లో రాక‌పోక‌లు నివారించేందుకు అంత‌రాష్ట్ర రోడ్ల మీద కూడా అలాంటి ప్ర‌య‌త్నం చేసింది. దాంతో ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా స‌మీప గ్రామాల్లో అటూ ఇటూ రాక‌పోక‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం వ‌ల్ల సాధార‌ణ జీవ‌నానికి పెద్ద ఆటంకంగా మారుతోంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్య‌వ‌హారంపై ఏపీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంతో మాట్లాడారు. ఇలాంటి వ్య‌వ‌హారాలు అన‌వ‌స‌రం ఆందోళ‌న‌కు దారితీస్తాయ‌ని, త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దాంతో చిత్తూరు క‌లెక్ట‌ర్ నుంచి వ‌చ్చిన సందేశాల‌తో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రా స‌రిహ‌ద్దుల్లో నిర్మించిన అడ్డుగోడ‌లు తొల‌గించేందుకు పూనుకున్నారు. గోడ‌లు నిర్మించిన గంటల వ్య‌వ‌ధిలోనే వాటిని తొల‌గించ‌డంతో ప్ర‌స్తుతం య‌ధాస్థితి ఏర్ప‌డింది.

త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల స‌మ‌స్య తీరుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలోనే ఒడిశా స‌రిహ‌ద్దుల్లో గిరిజ‌న ప్రాంతాల‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. గ‌జ‌ప‌తి జిల్లాకు చెందిన కొన్ని గిరిజ‌న గ్రామాల ప్ర‌జ‌లు స‌మీప శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు త‌మ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అందుకోసం ఏకంగా గుంత‌లు త‌వ్వ‌డం విశేషంగా మారింది. ఇది ఏపీ వాసుల నిత్యావాస‌రాల‌కు స‌మస్య‌గా మారుతోంది. తాజాగా శ్రీకాకుళంలో మూడు క‌రోనా కేసులు న‌మోద‌యిన నేప‌థ్యంలో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ఒడిశా గిరిజ‌నులు చెప్ప‌డం విశేషం.

అయితే క‌రోనా మ‌హ‌మ్మారిని అంతా క‌లిసి ఎదుర్కోవాల్సిన స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికే తీవ్ర న‌ష్టాన్ని చేకూరుస్తున్నాయి. అత్య‌వ‌స‌ర వేళ‌లో అంబులెన్సులు వెళ్లేందుకు దారిలేక అనేక గ్రామాల్లో తాత్కాలిక స‌రిహ‌ద్దులు పెద్ద స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతున్నాయి. గ్రామాల్లోనే అలా ఉంటే, ఇక అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌కు, అపోహ‌ల‌కు కార‌ణం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదే విష‌యాన్ని చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌స్తావించ‌డంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం గోడ‌లు తొల‌గించ‌డం విశేషం.ఒడిశా నుంచి ఈ విష‌యంలో సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌నే ఆశాభావంతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా పున‌రావృతం కాకుండా చూడాల‌ని అంతా కోరుకుంటున్నారు.

Show comments