Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. సుప్రిం కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తర్వాత ఏమి జరగబోతోందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయా..? లేదా మరేమైనా ఆటంకాలు ఎదురవుతాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే హైకోర్టులో జరిగిన వాదనల్లో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ 59.85 శాతం రిజర్వేషన్లను ఆఖరి వరకూ సమర్థించారు. నిబంధనలు అనుసరించే రిజర్వేషన్లు ఖరారు చేశామని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రింకు వెళుతుందా..? అంటే లేదనే చెప్పాలి. రిజర్వేషన్ల వివాదం పరిష్కరించాలని సుప్రిం కోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ ఈ విషయంలో సుప్రిం జోక్యం చేసుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్ఛయంతో ఉంది. నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 3200 కోట్ల రూపాయలు మురిగిపోయే అవకాశం ఉంది.
నిజానికి జనవరి 17వ తేదీనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా.. కర్నూలుకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబు ప్రభుత్వ హాయంలో జాతీయ గ్రామీణ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా పని చేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి 59.85 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చగా సుప్రిం కోర్టుకు వెళ్లారు. సుప్రిం స్టే విధించింది. వివాదాన్ని పరిష్కరించాలని తిరిగి హైకోర్టుకే బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో పలుమార్లు విచారణలు జరిపిన హైకోర్టు ఎట్టకేలకు ఈ రోజు తీర్పు వెల్లడించింది.
రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం వల్ల బీసీలకు కేటాయించిన 34 శాతంలో కోత పడనుంది. దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది. పాత విధానంలోనే.. అంటే 59.85 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని, బీసీలకు రిజర్వేషన్లు 34 శాతం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుంది. హైకోర్టును తీర్పును ప్రభుత్వం సుప్రింలో సవాల్ చేయాలంటూ వాదిస్తోంది. అసలు రిజర్వేషన్లపై సుప్రింకు వెళ్లిందే టీడీపీ నేతని వైఎస్సార్ సీపీ గుర్తు చేస్తోంది.
ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారా..? లేదా ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరిస్తుందా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 50 శాతం రిజర్వేషన్లు అయినా.. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన 59.85 రిజర్వేషన్లలో అధికారులు మార్పులు చేసి జాబితాను సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి, నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.