iDreamPost
android-app
ios-app

బంపర్ ఆఫర్.. ఈ మహిళలకు వడ్డీ లేకుండానే రూ. 3 లక్షల లోన్

బంపర్ ఆఫర్.. ఈ మహిళలకు వడ్డీ లేకుండానే రూ. 3 లక్షల లోన్

కాలం మారింది, కాలంతో పాటు ఆలోచనా విధానం కూడా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే తామే ఓ చిన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకుని పది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్నారు. కానీ దీనికోసం పెట్టుబడి అవసరం. అందులో మహిళలకు అయితే పెట్టుబడి సమకూర్చుకోవడం మరింత కష్టంగా మారుతుంది. ఇలా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉండి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వడ్డీ లేకుండా రుణం అందించేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఏవిధమైన వడ్డీ లేకుండా మహిళలకు ఏకంగా రూ. 3 లక్షల లోన్ అందిస్తోంది. మరి ఈ పథకానికి అర్హతలు ఏంటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. తాము దేంట్లో తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు మహిళలు. ఈ క్రమంలోనే మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి తమ కాళ్ల మీద తాము నిలబడి పదిమందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల వరకు లోన్ అందిస్తుంది. గవర్నమెంట్ నిర్దేశించిన 88 రకాల బిజినెస్ లలో తమకు అనువైన దానిని ఎంచుకుని బిజినెస్ ప్రారంభించవచ్చు. అంగవైకల్యం, వితంతువు మహిళలకు మాత్రం రుణ పరిమితి లేదు. అర్హతలు, ఎంచుకునే బిజినెస్ ను బట్టి వీలైనంత ఎక్కువ లోన్ పొందేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఉద్యోగిని పథకం ముఖ్య ఉద్దెశ్యం.. గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది.

ఆ మహిళలకు మాత్రమే వడ్డీ రహిత లోన్:

ఈ ఉద్యోగిని పథకం ద్వారా అంగ వైకల్యం ఉన్నవారికి, దళిత మహిళలు, వితంతువులకు ఏవిధమైన వడ్డీ లేకుండానే లోన్ అందిస్తారు. మిగతా వర్గాలకు చెందిన మహిళలకు మాత్రం 10 నుంచి 12 శాతం వడ్డీ మీద లోన్ ఇస్తారు.

అర్హతలు:

18 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అంతా ఉద్యోగిని పథకానికి అర్హులే. మహిళల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. దరఖాస్తుదారుకు అవసరమైన లోన్ మొత్తం కూడా రూ. 3 లక్షలకు మించకూడదు. రుణంపై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంగ వైకల్యం ఉన్నవారు, వితంతు మహిళలకు వయో పరిమితి, కుటుంబ ఆదాయం పరిమితి అవసరం లేదు.

అవసరమైన డాక్యుమెంట్లు:

దరఖాస్తు ఫారంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాలి. అప్లై చేస్తున్న మహిళ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు మాత్రం రేషన్ కార్డు కాపీ జతపర్చాలి. ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఈ పథకానికి అర్హులైన మహిళలు సంబంధిత డాక్యుమెంట్లతో దగ్గర్లోని బ్యాంకును సందర్శించి, అప్లికేషన్ ఫారం తీసుకున, అందులో అడిగిన అన్ని వివరాలను పూరించాలి. దీంతో పాటు డాక్యుమెంట్లను, ఫొటోలను అటాచ్ చేసి బ్యాంకుల సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు దరఖాస్తుదారుల అన్ని వివరాలు సరిచూసుకున్నాక లోన్ మంజూరు చేస్తుంది.