iDreamPost
android-app
ios-app

ఎల్బిలోని రైటర్ ని తప్పించిన యాక్టర్

  • Published Apr 06, 2020 | 1:41 PM Updated Updated Apr 06, 2020 | 1:41 PM
ఎల్బిలోని రైటర్ ని తప్పించిన యాక్టర్

ఈవీవీ సత్యనారాయణ గారు తీసిన చాలా బాగుంది సినిమా ద్వారా ఆర్టిస్టుగా తన టాలెంట్ ని పరిశ్రమకు రుచి చూపించి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా కొన్నేళ్ల పాటు బిజీ అయిపోయిన ఎల్బి శ్రీరామ్ గారి గురించి తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. అంతగా గొప్పగా ఆయన జనం మనసులో నాటుకుపోయారు. కామెడీ రోల్ అయినా ఎమోషన్స్ నిండిన సీరియస్ పాత్రైనా ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం తెరమీద కనిపించడం తగ్గినప్పటికీ తన స్వంత యుట్యూబ్ ఛానల్ లో అద్భుతమైన కాన్సెప్ట్స్ తో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు.

కాకపోతే ఎక్కువ శాతం జనానికి తెలియని విషయం ఏంటంటే ఆర్టిస్ట్ కన్నా ముందు శ్రీరామ్ గారు గొప్ప రచయిత. ఆయన కామిక్ సెన్స్ ముందు ఇప్పటి చేయి తిరిగిన రచయితలు సైతం జూనియర్స్ లా కనిపిస్తారు. కోకిలతో డైలాగ్ రైటర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన శ్రీరామ్ గారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా వంశీ ఏప్రిల్ 1 విడుదల. దాని తర్వాత వరసగా అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు ఆయనలోని గొప్ప హాస్య కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక నాగార్జున హలో బ్రదర్ సంభాషణలు ఆయన స్థాయిని మరింత పెంచాయి. అందులో పంచులు ఇప్పుడు చూసినా నవ్వాపుకోవడం కష్టం. చిరంజీవి హిట్లర్ తో ఒకేసారి డబుల్ ప్రమోషన్ దక్కింది. కానీ ఆ తర్వాత రాజేశ్వరి కళ్యాణం, ఓంకారం లాంటివి ఆశించిన విజయాలు అందుకోలేదు. రామసక్కనోడు సినిమాకు ఉత్తమ రచయితగా నంది అవార్డు సాదించారు.

నటుడిగా కెరీర్ త్వరగానే మొదలుపెట్టినప్పటి 2000వ సంవత్సరంలో వచ్చిన చాలా బాగుంది ఆయనలోని రైటర్ ని తప్పించి బిజీ ఆర్టిస్ట్ గా మార్చేసింది. దాంతో శ్రీరామ్ గారు తాత్కాలికంగా కలం పక్కన పెట్టక తప్పలేదు. నట ప్రయాణం అప్రతిహతంగా సాగిపోవడంతో 2009లో స్వంత ఊరు సినిమా వరకు ఆయన ఏ సినిమాకూ రచయితగా పనిచేయలేదు. ఒకవేళ చాలా బాగుంది లాంటి బ్రేక్ దక్కకపోయి ఉంటే ఆయన పెన్నునుంచి మరికొన్ని ఆణిముత్యాల్లాంటి హాస్య భరిత చిత్రాలు, ఎమోషనల్ మూవీస్ ఖచ్చితంగా వచ్చి ఉండేవి. అలా ఇండస్ట్రీ కోసం తనలో రైటర్ ని త్యాగం చేశారు శ్రీరామ్. మీకు అనుమానం ఉంటే పైన చెప్పిన సినిమాలు మరొక్కసారి చూడండి. శ్రీరామ్ గారి పంచుల పవర్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.