దారి చూపనున్న లక్స్మీ బాంబ్

థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా అనుమానాలు తీరకపోవడంతో బాలీవుడ్ నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో ఓటిటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రేంజ్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారి పడుతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఆన్ లైన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ముంబై అప్డేట్. వచ్చే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా వరల్డ్ ప్రీమియర్ గా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. నెల రోజుల క్రితమే దీనికి 150 కోట్ల డీల్ కుదిరినట్టుగా టాక్ వచ్చింది కాని యూనిట్ దాన్ని నిర్ధారించలేదు. అలా అని ఖండించనూ లేదు.

దీన్ని బట్టే ఒప్పందం కుదిరినట్టుగా మీడియా వర్గాలకు అర్థమైపోయింది. ఇది తొమ్మిదేళ్ల క్రితం 2011లో కాంచనకు రీమేక్. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అప్పట్లో మంచి కమర్షియల్ హిట్. వసూళ్లు కూడా భారీగా దక్కాయి. దీన్ని ఆ తర్వాత ఉపేంద్ర కన్నడలో రీమేక్ చేశారు. అక్కడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ వద్దకు వచ్చింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఫ్లాష్ బ్యాక్ పార్ట్ చేసిన శరత్ కుమార్ స్థానంలో హిందీలో సంజయ్ దత్ చేశారనే టాక్ ఉంది కానీ టీమ్ దాన్ని లీక్ కాకుండా జాగ్రత్త పడింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. భరత్ అనే నేను, వినయ విధేయ రామలతో తెలుగు వాళ్లకు సుపరిచుతురాలైన బ్యూటీ తను.

అయితే సౌత్ లో ఇప్పటికే కాంచనను చూసేశారు కాబట్టి ఇక్కడ ఎంత మేరకు స్పందన వస్తుందో చూడాలి. అమితాబ్ బచ్చన్ గులాబో సితాబో కొద్దిరోజుల క్రితం ఓటిటి రిలీజైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకు విద్యా బాలన్ శకుంతలా దేవి రానుంది. వీటన్నింటితో పోలిస్తే లక్స్మీ బాంబ్ చాలా పెద్ద రేంజ్ మూవీ. వంద కోట్లకు పైగా థియేట్రికాల్ మార్కెట్ ఉన్న అక్షయ్ కుమార్ సినిమా ఇలా నేరుగా నెట్ లో రావడం ఇదే మొదటిసారి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక మరికొందరు కూడా ఇదే బాటలో వెళ్ళబోతున్నారు. తమిళ్ లో మెల్లగా అడుగులు పడుతుండగా తెలుగులో కూడా ఆ దిశగా వెళ్తున్న నిర్మాతల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కరోనా తెచ్చిపెట్టిన చిక్కులు అన్ని ఇన్ని కావు. సినిమా వర్గాల మాటేమో కాని ఇంటికే వస్తున్న చవకైన వినోదాన్ని చూస్తూ ప్రేక్షకులు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు

Show comments