‘చిరుత’కు మెరుగులు దిద్దిన ‘ముని’ – Nostalgia

మెగా పవర్ స్టార్ గా అశేష అభిమానుల ఫాలోయింగ్ ని సంపాదించుకుని 12 సినిమాలకే వంద కోట్ల మార్కెట్ ని సులభంగా చేరుకున్న రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 2007లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అశ్వినిదత్ భారీగా నిర్మించిన చిరుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ అప్పటి షూటింగ్ జ్ఞాపకం. చిరంజీవికి హిట్లర్ లో సిగ్నేచర్ స్టెప్ ద్వారా గొప్ప పేరు తెచ్చుకున్న లారెన్స్ మాస్టర్ ఆ తర్వాత ఇంద్రలో దాన్ని మించిన మూమెంట్స్ తో అందరిని మెస్ మరైజ్ చేశాడు.

అందుకే చిరుతలో ఇంట్రో సాంగ్ ని ఓ రేంజ్ లో చూపించాలన్న ఉద్దేశంతో అప్పటికే దర్శకుడిగా స్థిరపడిన లారెన్స్ ని చరణ్ కోసం కోసం ప్రత్యేకంగా పిలిపించారు. ‘ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి’ అంటూ వచ్చే ఓ మొదటి పాటలో రామ్ చరణ్ హుషారైన స్టెప్స్ కి అభిమానులు ఈలలు కేకలతో హోరెత్తించారు. అంచనాలను పూర్తిగా అందుకుంటూ ఈ ట్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మణిశర్మ హుషారైన సంగీతం ఎంత జోష్ ఇచ్చిందో వేరే చెప్పాలా. మ్యూజికల్ గానూ ప్రతిచోటా చిరుత పాటలు మారుమ్రోగిపోయాయి. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది.

2007లో లారెన్స్ దర్శకుడిగా అప్పటికే మాస్, స్టైల్ ద్వారా తనదైన ముద్ర వేశారు. ముని రూపంలో హారర్ కామెడీని రూపొందించి ఓ సరికొత్త జానర్ కి తెరతీశాడు. అదే సంవత్సరమే చిరుత విడుదల కావడం విశేషం. రెండూ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత లారెన్స్ ఇంకా బిజీ అయిపోయి ఇప్పటికీ ముని ఫ్రాంచైజ్ కొనసాగిస్తూ విజయాలు అందుకుంటుండగా మరోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఏకంగా మూడు నాలుగు వందల కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేసుకున్నాడు. బహుశా చిరుత షూటింగ్ టైంలో లారెన్స్, చరణ్ లు ఇంత ఎదుగుదలని ఊహించారో లేదో. అలా 2007 ఇద్దరికీ చాలా స్పెషల్ మెమరీగా నిలిచిపోయింది. కాకతాళీయంగా ఈ ఇద్దరి సినిమాలు 2021 లేకపోవడం కూడా విచిత్రమే.

Show comments