iDreamPost
android-app
ios-app

లారెన్స్ మాస్టర్ డబుల్ బొనాంజా

  • Published Apr 10, 2020 | 5:00 AM Updated Updated Apr 10, 2020 | 5:00 AM
లారెన్స్ మాస్టర్ డబుల్ బొనాంజా

కరోనా కలకలం పరిశ్రమను కుదిపేస్తున్న వేళ డాన్స్ మాస్టర్ కం దర్శకుడు లారెన్స్ రాఘవ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే అనూహ్యంగా విరాళంతో పాటు రజినీకాంత్, తన ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్ ఇచ్చేశాడు. దాతృత్వం విషయానికి వస్తే తనది మరోసారి ఎంత పెద్ద చేయో నిరూపించాడు. ఏకంగా 3 కోట్ల మొత్తాన్ని కరోనా సహాయ నిధులకు అందజేశాడు. కోలీవుడ్ మొత్తంలో ఇదే పెద్ద ఫిగర్ కావడం గమనార్హం. లారెన్స్ కన్నా ఎంతో స్టార్ డం ఉన్న అగ్ర హీరోలు సైతం ఇంత మొత్తాన్ని ఇవ్వలేదు.

ఇందులో ప్రధానమంత్రి కేర్స్ కు 50 లక్షలు, తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, ఫెఫ్సీ యూనియన్ కు 50 లక్షలు, డాన్సర్ సమాఖ్యకు 50 లక్షలు, దివ్యాంగుల సంక్షేమంలో కోసం 25 లక్షలు, తన పుట్టిన ఊరైన రోయాపురం, దేశీనగర్ లో ఉండే పేద ప్రజల సహాయార్థం 75 లక్షలు ఇలా మొత్తంగా 3 కోట్లను ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అయితే డాన్సర్ గా డైరెక్టర్ గా తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన టాలీవుడ్ కు, తనకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి నెలకొల్పిన సిసిసికి ఎలాంటి మొత్తం ఇవ్వకపోవడం పట్ల సోషల్ మీడియాలో టాలీవుడ్ లవర్స్ విమర్శలు చేస్తున్నారు.

దీన్ని పక్కనపెడితే ఈ డబ్బుని తాను సన్ పిక్చర్స్ తీయబోయే చంద్రముఖి 2 కోసం తీసుకున్న అడ్వాన్స్ సొమ్ము నుంచి ఇస్తున్నట్టుగా చెప్పాడు. తలైవా రజినీకాంత్ తో నటించబోతుండటం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. దీనికీ పి వాసునే దర్శకత్వం వహించబోతున్నారు. ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి సీక్వెల్ రూపొందనుండటం విశేషం. ప్రస్తుతం శివ డైరెక్షన్ లో రూపొందుతున్న అన్నాతేలో నటిస్తున్న రజిని నెక్స్ట్ మూవీ చంద్రముఖి 2 అనే క్లారిటీ వచ్చేసింది. ఇలా లారెన్స్ కొరోనా సహాయంతో పాటుగా అధికారికంగా చంద్రముఖి ప్రకటన కూడా యూనిట్ కన్నా ముందే అఫీషియల్ గా ఇచ్చేశాడు. హారర్ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న లారెన్స్ రజినితో కూడా అదే తరహా చిత్రంలో నటించబోతుండటం విశేషం.