ఇటీవల కాలంలో కర్ణాటక రాజకీయ నాయకులు తమ అర్ధబలాన్ని, అధికార అంగబలాన్ని ప్రదర్శించడానికి తమ వారసుల వివాహా వేడుకలనే వేదికలుగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత విలాసవంతమైన పెళ్లిళ్లు రాజకీయ వర్గాల్లో సాధారణంగా మారాయి. గతంలో అత్యంత విలాసవంతంగా జరిగిన బళ్ళారి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి డబ్బులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టాడని, ఈ వివాహానికి 500 కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యిందని అప్పట్లో మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టే వివాహ వేడుకలు కనీవిని ఎరగని రీతిలో అత్యంత భారీ ఎత్తున జరిగాయి. స్వయంగా కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఈ వివాహ వేడుకల్లో సందడి చేశారు. సరిగ్గా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహానికి భారీగా ఖర్చు పెట్టడంపై అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అయితే కూతురి పెళ్ళికి 500 కోట్లు ఖర్చుపెట్టారనే వార్తలను గాలి తోసిపుచ్చాడు.
ఇదే తరహాలో ఇటీవలే కర్ణాటక మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న బిసి పటేల్ తన కూతురి పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నుండి బిజేపిలోకి ఫిరాయించిన బళ్లారికే చెందిన మైనింగ్ దిగ్గజం, మంత్రి ఆనంద్ సింగ్ కూడా తన కుమారుడి పెళ్లి అత్యంత ఘనంగా జరిపించి రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక వచ్చేనెలలో జరగనున్నమాజీ ప్రధాని దేవగుడ మనవడు ,కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం ఎంత వైభవంగా జరుగుతుందా అని కర్నాటక వాసులందరు ఎదురుచూస్తున్నారు. ఈ పెళ్లి కోసం బెంగుళూరు-మైసూర్ రహదారి పక్కన గల 50 ఎకరాల కొబ్బరితోటలో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.
తాజాగా బళ్ళారి జిల్లాకు చెందిన కర్ణాటక మంత్రి, గాలి సోదరులకు అత్యంత ఆప్తుడైన శ్రీరాములు కుమార్తె వివాహ వేడుకలు కూడా ఇదే కోవకి చెందుతాయి. ఉత్తర కన్నడ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బళ్ళారి శ్రీరాములు కుమార్తె రక్షిత పెళ్లి హైద్రాబాద్ బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారవేత్త శెట్టిపల్లి రవికుమార్ రెడ్డి తనయుడు లలిత్ సంజీవ రెడ్డితో నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకలు మొత్తం 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంలో ఈరోజు ఉదయం వివాహ కార్యక్రమంలో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘ముహూర్తం’ కార్యక్రమాన్ని బెంగుళూరు ప్యాలెస్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ముహుర్త కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. బెంగుళూరు లో వివాహానంతరం బళ్ళారి, హైదరాబాద్ లలో కూడా వివాహా రిసెప్షన్ కి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులు తమ వారసుల వివాహాలు ఇంత ఘనంగా జరిపించడానికి గల కారణాలు చూస్తే ముఖ్యంగా రాజకీయనాయకులతో, జనంతో మమేకం కావడానికి, తద్వారా జనంలో వ్యక్తిగత పరపతిని పెంచుకోవడానికి, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందడానికి తమ వారసుల పెళ్లి వేడుకలను మంచి సందర్భంగా ఉపయోగించుకుంటున్నారని అర్ధమవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడకుండా విలాసవంతమైన వివాహాలు జరిపించి ప్రజల దృష్టిని మరల్చుకోవడం ద్వారా తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని రాజకీయ నాయకులు బావిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే కర్ణాటక లో రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించడం వల్లే వందల కోట్ల ఖర్చుతో పెళ్లిళ్లు జరుపుతున్నారన్న ప్రచారం ఉంది.