మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణని వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈసందర్భంగా చంద్రబాబు కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని ఆమె కోర్టుని ప్రశ్నించారు. మొదట్లో ఎమ్మెల్యేగా కేవలం 300 రూపాయలు గౌరవ జీతంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు తర్వాతికాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడని లక్ష్మి పార్వతి ప్రధాన అభయోగం.
ఎసిబి కోర్ట్ లో మొదట చంద్రబాబు తరపున ఆయన లాయర్ వాదనల్ని వినిపించారు. అనంతరం లక్ష్మీపార్వతి తరపు లాయర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టులో స్టే ఉందని బాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు ఆ స్టే వివరాలను తాము పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, ఆయన అక్రమ ఆస్తులపై ఎసిబి విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి 2005 లో ఎసిబి స్పెషల్ కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.
దానితో 2005 లో చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఎసిబి కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005 లో స్టే విధించారు. అయితే ఈ స్టేను ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి అప్పట్లో అనుబంధ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు ఆమె పిటిషన్ ని కొట్టేసింది. అప్పటి నుంచి చంద్రబాబు అక్రమాస్తుల కేసులో విధించిన ఇటీవల వరకు కొనసాగింది.
అయితే ఇటీవల 2018 మార్చి 28 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ఈ కేసులోనైనా ఆరు నెలలకు మించి స్టే కొనసాగితే ఆరునెలల తర్వాత ఆ కేసుపై స్టే ఎత్తివేయాలని సుప్రీం కోర్ట్ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అక్రమాస్తుల కేసులో ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం హై కోర్ట్ లో విధించిన స్టే రద్దయి విచారణ తిరిగి ప్రారంభం అయింది.