iDreamPost
iDreamPost
రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడంతో జిల్లా ముఖచిత్రం మారనుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందనుంది. విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఇక అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది.
కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. దశాబ్దాలుగా రాయలసీమలో హైకోర్టు ఉండాలని కోరుకుంటున్నా ఇంతవరకు అది నెరవేరలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని జిల్లావాసులంతా స్వాగతిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల న్యాయవ్యవస్థకు సంబంధించిన సంస్థలన్నీ కర్నూలు కేంద్రంగా పనిచేస్తాయి. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, డెబ్స్ రికవరీ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రైల్వే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఏసీసీ కోర్టు, లోకాయుక్త, మానవ హక్కులక కమీషన్, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమీషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌తో పాటు అనుబంద కోర్టులన్నీ కర్నూలు కేంద్రంగా ఏర్పాటుఅవుతాయి. అన్ని విభాగాలకు సంబంధించిన కేసులు న్యాయ రాజధాని కేంద్రంగా విచారణ చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు కూడా ఇక్కడే ఉంటారు. ఈ విభాగాల న్యాయమూర్తులతో వెయ్యి మందికి పైగా మినిస్టీరియల్ సిబ్బంది కర్నూలుకు వస్తారు. 4వేల మందికిపైగా హైకోర్టు న్యాయవాదులు కర్నూలులో స్థిరపడాల్సి ఉంటుంది. వీరే కాకుండా ఇతర సిబ్బంది, ఉద్యోగులు 5వేల మంది దాకా వచ్చే అవకాశం ఉంది.
దాదాపు 10వేల మంది వస్తే వారి కుటుంబ సబ్యులు కలిపి 10వేల కుటుంబాలు కర్నూలుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కర్నూలు నగరం మరింత విస్తరించనుంది. ఇప్పటికే కుడా(కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో 9 మండలాల్లో 117 గ్రామాలున్నాయి. ఈ పంచాయతీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. వీటి పరిధిలో కర్నూలు మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఇక జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. రాజధాని అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తుంది. ఇప్పటికే తుంగభద్ర నది కర్నూలు మీదుగా ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా సమీపంలోనే ఉంది. ఇక పరిశ్రమలకు అనుకూలమైన వ్యవసాయానికి పనికిరాని భూములు జిల్లాలో చాలానే ఉన్నాయి. దీంతో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచెయ్యటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
హైకోర్టు ఉందంటే అక్కడ వ్యాపారాలు మెండుగా ఉంటాయి. హైకోర్టు ఏర్పాటుతో కొత్తగా వచ్చే కుటుంబాలతో పాటు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు కర్నూలులో వచ్చి స్థిరపడే అవకాశం ఉంది. వీరితో పాటు కోర్టులకు సంబంధించిన పనులతో కర్నూలుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిపోయే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీరంతా ఉండేందుకు వీలుగా స్టార్ హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సమూదాయాలు పెరగనున్నాయి. ఇప్పటికే నగరంలో సిటీ స్క్వైర్స్, బిగ్ బజార్, డీమార్ట్, స్పెన్సర్స్, రియలన్స్, వాల్‌మార్ట్ ఏర్పాటయ్యాయి. ఇవే కాకుండ ఇంకా మరిన్ని ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటిని ఏర్పాటుచేసేం భూములు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అంతేకాకుండా ఇవి ఏర్పాటు అవ్వడంతో ఉపాది అవకాశాలు కూడా పెరుగుతాయి. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాది దొరకనుంది.
న్యాయ రాజధాని ఏర్పాటైతే విద్యాసంస్థలు కూడా ఏర్పాటవుతాయి. ఇప్పటికే జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్శిటీ ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన కర్నూల మెడికల్ కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత పెరుగనున్నాయి. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలు మెరుగవ్వనున్నాయి. జిల్లాలో ఒక ప్రైవేటు లా కాలేజీ మాత్రమే ఉంది. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటయ్యాక లా కళాశాలలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మరిన్న విద్యాసంస్థలు ఏర్పాటవుతాయి. దీని ద్వారా విద్యావకాశాలు మెరగవుతాయి. ఉద్యోగ, ఉపాది అవకాశాలు కూడా పెరుగనున్నాయి.
ఇప్పటికే కర్నూలుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లులో ఎయిర్‌పోర్టు ఉంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్టుకు ఇప్పుడు మహార్దశ పట్టనుంది. ఇది ప్రారంభమైనప్పటికీ సర్వీసులు మాత్రం నడపడం లేదు. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు సర్వీసులు నడిపే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజధానికి వచ్చే వీఐపీలు, వీవీఐపీలు వచ్చే అవకాశం ఉండటంతో సర్వీసులు రెగ్యులర్‌గా తిరిగే అవకాశం ఉంది. ఇక రవాణా సౌకర్యం కూడా పెరిగే అవకాశం ఉంది. అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు కర్నూలు నుంచి విజయవాడకు రైలుమార్గం కూడా గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇప్పుడు కర్నూలు నుంచి విజయవాడ, విశాఖలకు నిత్యం రైలు మార్గం ఉండేలా కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రోడ్డు కనెక్టివిటీ కూడా పెరుగనుంది.
ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఆరెనెలల కాలంలోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వాసులు సంబరపడిపోతున్నారు. తాము వైసీపీపై ఉంచిన నమ్మకాన్నిసీఎం జగన్ నిలబెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు.