iDreamPost
android-app
ios-app

కూన రవి…స్థాయి మరచి విమర్శలా…?

కూన రవి…స్థాయి మరచి విమర్శలా…?

కూన రవికుమార్…ఈ ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యేని ఉత్తరాంధ్ర చింతమనేని అనొచ్చేమో…! యాదృచ్చికంగా రవి సైతం చింతమనేని తరహాలో విప్ పదవిని వెలగబెట్టి…అధికారులపై దమనకాండ కొనసాగించిన వాడే కావడం గమనార్హం. కాగా, కొన్ని రోజులుగా కూన రవి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే తన స్థాయి దాటి మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది.

నవ్వుకొనే విమర్శలా…

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సరైన విజన్ లేదు…అందుకే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ కూన రవి ప్రభుత్వంపై చిందులు తొక్కారు. దీంతోపాటు చేతకాకుంటే తప్పుకుని ఆ పని చంద్రబాబుకు అప్పగిస్తే చిటికెలో కంట్రోల్ చేస్తాడు అనే తరహాలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రపంచంలోని అగ్రరాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు కరోనాను ఎలా కంట్రోల్ చేయాలా అంటూ మల్లగుల్లాలు అవుతుంటే కూన రవి లాంటి వాళ్ళు అవగాహనా లేమితో తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారంటూ  

విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడుకీ లేని విజన్, సామర్థ్యం చంద్రబాబుకి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కూన రవికి… ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లేదని, అతనో రాజకీయ ముసుగులోని రౌడీ అంటూ వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి.

విజన్ అంటే నీదేలే….

బావచాటు(స్పీకర్ తమ్మినేని) మరిదిలా రాజకీయాల్లోకి వచ్చిన రవి…తర్వాత ఆయనకే మేకైన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా గెలిచిన వెంటనే రాజకీయల్లో ఓనమాలు నేర్పించిన గురువు, స్వయానా అక్క భర్త అయిన తమ్మినేనిపై కక్షా రాజకీయాలకు దిగిన చరిత్ర కూన రవికి ఉంది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విజన్ ఉన్న కూన రవి… కరోనా, రాష్ట్ర భవిష్యత్తు అంటూ విమర్శలు చేస్తే వాటికి నైతికత ఉంటుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చేసేది రౌడీయిజం…మాటలు చూస్తే…

మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు, రాజ్యాంగంపై అవగాహన లేనివారికి అంబేద్కర్ విగ్రహానికి దండేసే అర్హత లేదు… ఇవీ కొన్ని రోజుల కిందట కూన వ్యాఖ్యలు. కాకపోతే సరబుజ్జిలి ఎంపీడీవోని నోటికొచ్చినట్టు తిట్టినప్పుడు…చెట్టుకు కట్టేసి కొడతా అన్నప్పుడు.. రాజ్యాంగమే ఆ అధికారులకూ కొన్ని హక్కులు కల్పించిందనే విషయం కూన రవికి గుర్తులేకపోవటం గమనార్హం. అలాగే మరో ప్రభుత్వ ఉద్యోగిని నాలో రెండో యాంగిల్ చూడొద్దు…నువ్వు విశాఖపట్నం ఇంట్లో ఉన్నా తీయసుకొచ్చి పాతేస్తా అని బెదిరించిప్పుడు… ఓ కార్యకర్తను టీడీపీ జెండా పట్టుకోకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వను అని బయపెట్టినప్పుడు….రాజ్యాంగం ప్రతి పౌరుడుకీ కొన్ని హక్కులు కల్పించిందనే విషయం ఈ మాజీ విప్ గారికి గుర్తుకురాకపోవడం శోచనీయం. రాజకీయ నాయకులు చెప్పేది అనుసరించరు…అనుసరించేది చెప్పరు అనే నానుడి బహుశా కూన రవికుమార్ లాంటి వాళ్ళను చూసే పుట్టుండొచ్చు.