ప్రభుత్వం పెద్ద మనసు… వారికి కూడా సహాయం

ఆపత్కాలంలో ఏపీలో జగన్‌ సర్కార్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలకు వీలైనంత సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విషయం తాజా నిర్ణయంతో అర్థమవుతోంది. పాత రేషన్‌కార్డుదారులందరికీ ప్రభుత్వం ఇచ్చే సహాయం అందుతుందని ప్రకటించింది.

కరోనా ప్రభావం వల్ల ప్రజలకు అందించే ఉద్దీపన చర్యల్లో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన ప్రతి వ్యక్తికి 15 కేజీల బియ్యం, మూడు కేజీల కందిపప్పు, రేషన్‌కార్డుకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపుప్పును నిన్న ఆదివారం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. వచ్చే నెల 4వ తేదీన వెయ్యి రూపాయలు వాలంటీర్లు రేషన్‌కార్డు దారులకు అందివ్వనున్నారు. 15, 29 తేదీల్లో రెండు, మూడు విడతల్లో ఐదు కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు చొప్పున అందివ్వనున్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గతంలో కార్డులున్న వారందిరకీ ఈ సహాయం అందనుంది. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత వైఎస్సార్‌ నవశకం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలువురు రేషన్‌కార్డులకు అనర్హులను తేలింది. పలు దఫాలు పరిశీలన తర్వాత వారందరి కార్డులు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో వారందరికీ ప్రభుత్వం సహాయం అందజేయాలని సర్కార్‌ నిర్ణయించడం విశేషం.

Show comments