Idream media
Idream media
పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే కసితో టీఆర్ఎస్ పని చేస్తోంది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. తమ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గెలుపు సూత్రాలు నేర్పుతున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఎదుటి పార్టీలోని అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను తమ పార్టీ అభ్యర్థులకు తెలియజేస్తున్నారు.
కేసీఆర్ హాలియాలో సభ నిర్వహించిన తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ఆ సభ ముగిసిన వెంటనే లైన్ లోకి వచ్చిన జానారెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి జానారెడ్డి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇటీవల బీజేపీ నాయకత్వం కూడా సమావేశమై పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గిన క్రమంలో తమ సిటింగ్ స్థానం సాగర్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో కూడా విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఉండడంతో కేసీఆర్ ఆ పార్టీ శ్రేణులను వెనుకుండి నడిపిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్‌లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని బరిలోకి దించడంతో విపక్షాలకు ఊహించని షాక్ ఎదురైంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదనే అధినేత ఆదేశాలతో ఆ పార్టీ మంత్రులు, నేతలు సీరియస్ గా దృష్టి పెట్టారు. క్షేత్ర స్థాయి కేడర్‌ను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు.
‘‘అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు. ఆ తేడాను గుర్తించండి. ఆ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడూ పనిచేస్తామంటే కుదురదు’’ అని మంత్రులకు కేసీఆర్ ఉపదేశం చేసినట్లు తెలిసింది. కాస్త రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే పట్టభద్రులను ఆకట్టుకోవడానికి, వారికి చేరువ కావడానికి టీఆర్ఎస్ యంత్రాంగం చేయాల్సిందంతా చేస్తోంది.
గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగ నియామకాలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతోంది. ఇందుకు సోషల్‌మీడియాతోపాటు ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలను టీఆర్ఎస్ విరివిగా వినియోగించుకుంటోంది. ప్రధానంగా సిట్టింగ్ స్థానం ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందేలా కార్యాచరణ రూపొందించేందుకు కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ మేరకు ‘వరంగల్’ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించి గెలుపు బాధ్యత వారికే అప్పగించారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మిగిలిన నాయకులతో సమన్వయం చేసుకునే ఎన్నికల్లో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ తేదీకి మరో 13 రోజులు మాత్రమే ఉన్నందున, సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేయడంతోపాటు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నిక ప్రచారం చేపట్టేందుకు టీమ్ ను సిద్ధం చేస్తున్నారు. సాగర్‌లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా, గెలుపే లక్ష్యంగా అందరూ సమష్టిగా పని చేసేలా కేసీఆర్ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ తాజాగా చేయించిన సర్వేల ప్రకారం సిటింగ్ స్థానాన్ని టీఆర్‌ఎస్ మంచి మెజారిటీతో నిలబెట్టుకోనున్నట్లు తేలిందని, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, అతి తక్కువ ఓట్లతో బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందన్న వివరాలు చెబుతూ ఆ పార్టీ శ్రేణులను కేసీఆర్ ఉత్సాహపరుస్తున్నట్లు తెలిసింది. అటు ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించిన వ్యూహాలను రచిస్తూ, ఇటు గెలిచిన తీరాల్సిన ఆవశ్యకతపై నేతలను హెచ్చరిస్తూ అన్ని స్థానాల్లోనూ గెలిచేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.