iDreamPost
iDreamPost
తెలంగాణాలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత రాజకీయంగా సైలెంట్ గా ఉన్న తన కుమార్తె కల్వకుంట్ల కవితను పెద్దల సభకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. లోక్ సభ ఎన్నికల బరిలో రెండోసారి విజయం సాధించాలని ఆశించిన కవిత గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలుకావడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఖంగుతినాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే నిజామాబాద్ నుంచి స్థానిక ఎన్నికల ఎమ్మెల్సీగా ఇప్పుడు కవిత రంగంలో దిగడంతో తెలంగాణా రాజకీయాల్లో కీలక మార్పులు తప్పకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా కవిత కీలక పాత్ర పోషించారు. అనేక కార్యక్రమాలతో నిత్యం ఆమె వార్తల్లో ఉండేవారు.అటు పార్లమెంట్ లోనూ, ఇటు నియోజకవర్గంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కానీ ఊహించనిరీతిలో ఓటమి పాలయిన తర్వాత ఆమె దాదాపు మౌనంగా ఉన్నారు. చివరకు స్థానిక ఎన్నికలు, మునిసిపల్ పోరులో కూడా ఆమె దూరంగానే ఉన్నారు. అదే సమయంలో తండ్రి కేసీఆర్ స్థానంలో అన్న కేటీఆర్ కీలకనేతగా మారారు. టీఆర్ఎస్ వ్యవహారాలను ప్రస్తుతం దాదాపుగా కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో కవిత మౌనం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
తాజా నిర్ణయంతో కేసీఆర్ తన కుమార్తెకి రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాల స్థానంలో రాష్ట్రంలోని ఎగువ సభకు ఆమెకు అవకాశం దక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే కేటీఆర్ కీలక నేతగా ఎదిగిన సమయంలో ఇప్పుడు కవిత ఎంట్రీ కాస్త ఆసక్తికరంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి తొలుత మేనల్లుడు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ ని కూడా క్యాబినెట్ లోకి తీసుకోకుండా కేసీఆర్ రాజకీయంగా ప్రయోగమే చేశారు. కానీ దాని ఫలితాలు కొంత నష్టం చేస్తున్నాయనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్లీ వారిద్దరికీ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పుడు ఇరువురు నేతలు తెలంగాణా ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
కవిత కూడా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నిక లాంఛనమే కావటం ఆమె కి కూడా క్యాబినెట్ బెర్త్ దక్కుతుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కవితను కేవలం ఎమ్మెల్సీ స్థానానికే పరిమితం చేయకుండా మంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణా మహిళా మంత్రుల్లో సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్లు ఉన్నప్పటికీ కవిత వంటి వాగ్ధాటి ఉన్న నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రభుత్వ వాణీని మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణుల్లోనే చర్చ సాగుతోంది. ఏమయినా కవిత రీ ఎంట్రీ ద్వారా ఎలాంటి పదవులు అందుకుంటారనేది తెలంగాణా రాజకీయ పరిణామాల్లో కీలకాంశం అవుతుందని చెప్పవచ్చు.