iDreamPost

ఆరెక్స్ హీరో పెద్ద ప్లాను

ఆరెక్స్ హీరో పెద్ద ప్లాను

ఆరెక్స్ 100తో రెండో సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని దాని పుణ్యమాని ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజిలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఇతనికి తమిళనాడులో క్రేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ హీరోగా రూపొందుతున్న వలిమైలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు.

కార్తీ ఖాకీతో మనవాళ్లకూ బాగా దగ్గరైన వినోత్ దర్శకత్వంలో ఇది భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఒకవేళ లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారు. బోనీ కపూర్ నిర్మాతగా అజిత్ చేస్తున్న రెండో సినిమా ఇది. గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ తప్ప ఇంకో ఫలితం లేకుండా సక్సెస్ ట్రాక్ మీద దూసుకుపోతున్న అజిత్ మూవీ కావడంతో వలిమై మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కనక హిట్ అయితే కార్తికేయకు కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి. మనవాళ్ళు అక్కడ జెండా పాతలేకపోతున్నారనే లోటుని కొంతైనా తీర్చవచ్చు.

అసలే ఇక్కడ టైం కలిసి రావడం లేదు. హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ ఇలా వరస డిజాస్టర్లతో మార్కెట్ ఎఫెక్ట్ అయ్యింది. అయినా ఛాన్సులు వస్తున్నాయి కానీ గట్టి హిట్టు పడితే తప్ప ఎక్కువ కాలం మార్కెట్ లో నిలదొక్కుకోవడం కష్టం. ఎలాగూ వలిమై తెలుగులో కూడా అనువదిస్తారు. మనవాళ్లకూ కనెక్ట్ అయితే ఇంకా బాగా వర్కవుట్ అవుతుంది. నాని గ్యాంగ్ లీడర్ లో ఆల్రెడీ విలన్ గా చేసిన అనుభవంతో పాటు మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న కార్తీకేయకు ఈ వలిమై ఏ మేరకు కోరుకున్న ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి