Idream media
Idream media
కందుకూరు.. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులు. విలక్షణమైన రాజకీయానికి కందుకూరు పెట్టింది పేరు. ఓ పదిహేనేళ్లు మినహా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రెండు కుటుంబాలదే అక్కడ రాజకీయ ఆధిపత్యం. దివి, మానుగుంట కుటుంబాల మధ్యనే పోటీ నడిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో 2014లో మానుగుంట కుటుంబం పోటీకి దూరంగా ఉండగా.. 2019 ఎన్నికల్లో దివి కుటుంబం పోటీకి దురమైంది. ఇక భవిష్యత్‌లో కూడా దివి, మానుగుంట కుటుంబాలు ప్రత్యర్థులుగా పోటీ పడే అవకాశాలు సన్నగిల్లాయనే చెప్పవచ్చు.
1970లో ప్రకాశం జిల్లా ఏర్పడకముందు కందకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఈ అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ పరిధిలోనే కొనసాగుతోంది.
1951లో తొలిసారి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల్లో ద్విసభ (ఒకటి జనరల్,ఒకటి SC రిజెర్వేడ్) నియోజకవర్గంగా ఉన్న కందుకూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నల్లమోతుల చెంచురామనాయుడు,కమతం షణ్ముగం గెలిచారు. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (KMPP) తరుపున పోటీ చేసిన దివి కొండయ్య చౌదరి మూడవ స్థానానికి పరిమితం అయ్యారు.
1955లో కాంగ్రెస్, సీపీఐల మధ్య పోటీ నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి దివి కొండయ్య చౌదరి, సీపీఐ అభ్యర్థి రావిపాటి వెంకయ్యపై గెలుపొందారు.
1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి.. నల్లమోతు చెంచురామానాయుడు అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివి కొండయ్య చౌదరి స్వతంత్ర పార్టీ తరఫున బరిలోకి దిగారు. 1672 ఓట్ల ఆధిక్యంతో నల్లమోతు చెంచురామానాయుడు దివి కొండయ్య చౌదరిపై గెలుపొందారు. 1967 ఎన్నికల్లోనూ నల్లమోతు చెంచురామానాయుడు కాంగ్రెస్ తరఫున గెలిచి మంత్రి అయ్యారు.
1972లో తొలిసారి ఓ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మానుగుంట ఆదినారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున నల్లమోతు చెంచురామానాయుడు బరిలోకి దిగారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన చెంచురామానాయుడును స్వతంత్ర అభ్యర్థి అయిన మానుగుంట ఆదినారాయణ రెడ్డి మట్టికరిపించడం విశేషం. చెంచు రామ నాయుడు బ్రహ్మానందరెడ్డి,పీవీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు.
1978 ఎన్నికల్లో ఎన్నికల్లో ఇందిర కాంగ్రెస్ అభ్యర్థి దివి కొండయ్య చౌదరి అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే(స్వతంత్ర) మానుగుంట ఆదినారాయణ రెడ్డి జనతాపార్టీ తరఫున పోటీ చేయగా.. న్యాయవాది బట్టరుశెట్టి కొండయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అంగిరేకుల వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇందిర కాంగ్రెస్ అభ్యర్థి దివి కొండయ్య చౌదరికి 35,361 ఓట్లు, జనతా పార్టీ అభ్యర్థి మానుగుంట ఆదినారాయణ రెడ్డికి 23,056 ఓట్లు వచ్చాయి. 12,305 ఓట్ల మెజారిటీతో దివి కొండయ్య చౌదరి గెలుపొందారు. ఈ ఎన్నికల నుంచే దివి, మానుగుంట కుటుంబాల మధ్య రాజకీయ పోరు ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వతంత్ర అభ్యర్థి బట్టరుశెట్టి కొండయ్య 9,571, కాంగ్రెస్ అభ్యర్థి అంగిరేకుల వెంకటేశ్వరరావు 5,862 ఓట్లు పొందారు.
1978–83 మధ్య కాలంలోనే మూడేళ్లు పాటు దివి కొండయ్య చౌదరి ఇందిర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్‌గా పని చేశారు.
ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీగా 1983లో టీడీపీ ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దివి కొండయ్య చౌదరి, టీడీపీ తరఫున ప్రముఖ పొగాకు వ్యాపారి గుత్తా వెంకట సుబ్బయ్య పోటీ చేయగా.. మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా మానుగుంట ఆదినారాయణ రెడ్డి తన అదృష్టం పరిక్షీంచుకునేందుకు బరిలో నిలిచారు. ఎన్టీఆర్ హవాను తుత్తునియులు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆది నారాయణ రెడ్డి గెలిచిన రెండు సార్లు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఇక్కడ విశేషం.
1985లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన గుత్తా వెంకట సుబ్బయ్య పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే(స్వతంత్ర) మానుగుంట ఆదినారాయణ రెడ్డి అభ్యర్థి అయ్యారు. ద్విముఖ పోరులో ఆదినారాయణ రెడ్డిదే పైచేయి అయింది. 1983 ఎన్నికలు దివి కొండయ్య చౌదరికి, 1985 ఎన్నికలు మానుగుంట ఆదినారాయణ రెడ్డికి చివరి అయ్యాయి.
1989 ఎన్నికల్లో మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసుడుగా ఆయన చిన్న కుమారుడు మహిధర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మహిధర్ రెడ్డి, టీడీపీ తరఫున మారుబోయిన మాలకొండయ్య యాదవ్ పోటీ చేయగా.. మహిధర్ రెడ్డి 10,198 ఓట్ల మెజారిటీతో పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1994 ఎన్నికల్లో దివి కొండయ్య చౌదరి వారసుడుగా.. ఆయన తనయుడు డాక్టర్ దివి శివరాం రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
1994 ఎన్నికలకు ముందు వచ్చిన అకాల వర్షం, వరదలతో కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న మహిధర్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కోట్ట విజయభాస్కర్ రెడ్డిని ప్రాజెక్టు సందర్శనకు రావాల్సిందిగా కోరారు. ఎన్నికల సమయం కావడంతో విజయభాస్కర్ రెడ్డి మహిధర్ రెడ్డి వినతిని తిరస్కరించారు. మహిధర్ రెడ్డి అలకబూని, పోటీ చేయనని చెప్పేసి వచ్చారు. అదే సమయంలో పీవీ నరశింహారావుకు తన కాలేజీనాటి స్నేహితుడైన లాయర్ బట్టరుశెట్టి కొండయ్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు.
మహిధర్ రెడ్డికి టికెట్ ఇప్పంచాలని మాగుంట సుబ్బిరామిరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సమయంలో మహిధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేశారు. మహిధర్ రెడ్డి తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అవగా.. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కాబట్టి, మహిధర్ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తారనే ధీమాతో ఆయన అనుచరులు ఎన్నికల్లో పని చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివి శివరాం గెలుపొందారు. మహిధర్ రెడ్డి మాదిరిగానే శివరాం కూడా పొటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యే అయ్యారు. దివి శివరాంకు 52,376 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డికి 46,351 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బట్టరుశెట్టి కొండయ్యకు 5,916 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి బట్టరుశెట్టి కొండయ్య . కొండయ్య స్వయంగా తమ వర్గం ఓట్లను టీడీపీకి వేయించాడని ప్రచారం జరిగింది. కొండయ్య వర్గం ఓట్లు ఆయనకే పది ఉంటె స్వతంత్ర అభ్యరధిగా పోటీచేసి కేవలం ఆరు వేల ఓట్ల స్వపాల తేడాతో ఓడిపోయినా మహీధర్ రెడ్డి సులభంగా గెలిచేవాడు.తండ్రి ఆదినారాయణ రెడ్డిలాగే తనయుడు మహిధర్‌రెడ్డి కూడా గెలుపు బావుటా ఎగురవేస్తారనుకున్న మానుగుంట కుటుంబ అనుచరులకు నిరాశే ఎదురైంది.
1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా మానుగుంట మహిధర్‌రెడ్డి అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివి శివరాం యథావిధిగా టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లోనూ గెలుపొందిన శివరాం రెండోసారి వరుసగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. దివి శివరాం చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన మానుగుంట మహిధర్ రెడ్డి 2004లో శివరాంను మట్టికరిపించారు. 1997–98 మధ్యలో దివి శివరాం ప్రధాన అనుచరుడు, టీడీపీ ముఖ్యనేత చిడిపోతు లక్ష్మయ్యనాయుడును నక్షలైట్లు పట్టపగలు కందుకూరు పట్టణంలో సింగరాయకొండ రోడ్డులోని డాక్టర్ కోటారెడ్డి ఆస్పత్రి సమీపంలో కాల్చి చంపారు. పట్టణంలో అల్లర్లు, దోపిడీలు, దొమ్మిలు జరిగాయి. అల్లర్లు, దోపిడీలను నియంత్రించేందుకు స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి కాల్పులకు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
లక్ష్మయ్య నాయుడు మరణంతో శివరాంకు కుడిభుజం కోల్పయినట్లైంది. అంతకు ముందు పట్టణంలో జరిగిన అల్లర్లు కూడా శివరాంపై పట్టణ ఓటర్లలో వ్యతిరేకతకు కారణమైంది. దీంతో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా శివరాం మానుగుంట మహిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009లో ఓటమితో తీవ్ర అసహనంతో దివి శివరాం అనుచరులు కందుకూరు పట్టణంలో భీభత్సం సృష్టించారు. కందుకూరు నడిబొడ్డు అయిన పోస్టాఫీసు సెంటర్‌లో ఉన్న గుప్తాస్ ప్లాజా(బంగారు నగల షోరూం)ను ధ్వంసం చేశారు.
ఇక 2014 ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో మరో శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన, వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిధర్‌రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన తనయుడు, అప్పటి కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టారు. ఆయనకు మద్ధతుగా 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందులో అప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలున్నారు. ఉప ఎన్నికల్లో తిరిగి ఒంగోలు శాసన సభ్యుడిగా బాలినేని గెలిచారు. ఆయన స్థానంలో ఖాళీ అయిన మంత్రి పదవి మానుగుంట మహిధర్‌రెడ్డికి దక్కింది. 2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉన్న మహిధర్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున దివి శివరాం టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగగా, వైఎస్సార్‌సీపీ తరఫున అప్పటి ఎమ్మెల్సీ, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పోతుల రామారావు అభ్యర్థి అయ్యారు. కందుకూరు నియోజకవర్గం నుంచి రెండోసారి నాన్‌లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి సారి నల్లమోతు చెంచురామానాయుడు 1962, 1967ల్లో కాంగ్రెస్ తరఫున గెలవగా.. 2014లో పోతుల రామారావు వైసీపీ తరఫున విజయం సాధించారు. వీరిరువురూ కందుకూరు పక్క నియోజకవర్గమైన కొండపికి చెందిన వారే కావడం గమనార్హం. మానుగుంట మహిధర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి పోతుల రామారావుకు సహకరించడంతో విజయం సులువైంది.
వైసీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించడంతో కందుకూరులో వైసీపీ శ్రేణులు చుక్కాని లేని నావలా మారారు. ఆ సమయంలో తూమాటి మాధవ రావు పార్టీ కో ఆర్డినేటర్ అయ్యారు. తుమాటి మాధవరావు టీడీపీలో ఉంటూ.. 2009 ఎన్నికలకు ముందు ఒంగోలు పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో మానుగుంట మహిధర్‌రెడ్డి విజయానికి పని చేశారు.
పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినప్పటి నుంచి 2019 ఎన్నికల వరకూ తుమాటి మాధవరావే కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమాటి మాధవరావు బలం సరిపోదని భావించిన వైసీపీ అధిష్టానం మానుగుంట మహిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చింది. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ఆ బాధ్యతను తీసుకుని మహిధర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను తన అనుచరులతో కలసిన మహిధర్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. కందుకూరులో నియోజకవర్గంలో అనుచరగణం అంతా మహిధర్‌రెడ్డి వెనకే ఉండడం ఆయనకు వైసీపీ టిక్కెట్ రావడంలో కలిసి వచ్చింది.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోతుల రామారావు, వైసీపీ అభ్యర్థిగా మానుగుంట మహిధర్ రెడ్డి పోటీ చేశారు. మహిధర్‌రెడ్డి విజయం అందుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఐదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా మానుగుంట మహిధర్‌రెడ్డి నియోజకవర్గంపై తన పట్టు సడలలేదని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో దివి శివరాంకు టిక్కెట్ ఇవ్వలేమని భావించిన టీడీపీ అధిష్టానం ఆయనకు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించింది.
2009 ఎన్నికలే దివి శివరాంకు చివరి ఎన్నికలయ్యాయి. భవిష్యత్‌లో ఆయన పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. పిల్లలు లేకపోవడంతో ఆయన వారసత్వం కొనసాగించే వారూ లేరు. దివి, మానుగుంట కుటుంబాల మధ్య ఇకపై పోరు సాగే అవకాశం లేదనే చెప్పాలి. మానుగుంట కుటుంబ వారసత్వం మాత్రం కొనసాగే అవకాశం పుష్కలంగా ఉంది. మానుగుంట మహిధర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. మహిధర్ రెడ్డి అన్న మానుగుంట ప్రభాకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. 2009లోనే తన బాబాయి మహిధర్‌రెడ్డి స్థానంలో పోటీ చేసేందుకు చైతన్య రెడ్డి ఆసక్తి చూపారు. ప్రస్తుతం చైతన్య రెడ్డి చెన్నైలో వ్యాపారం చేస్తున్నారు. మహిధర్ రెడ్డి తాను పోటీ చేయలేనని భావించిన రోజున వైసీపీ అభ్యర్థి చైతన్య రెడ్డి అవుతారు. అవి 2024 లేదా 2029 ఎన్నికలు కావచ్చు.