iDreamPost
android-app
ios-app

అబ్బురపరిచిన కమల్ నట చతురత – Nostalgia

  • Published Jul 27, 2021 | 12:39 PM Updated Updated Jul 27, 2021 | 12:39 PM
అబ్బురపరిచిన కమల్ నట చతురత – Nostalgia

సాధారణంగా స్టార్ హీరోలు ఆడ వేషాలు వేయడం అరుదేమి కాదు. చిన్న సీన్లు లేదా ఒక పాటలో అలా కనిపించి తమ ముచ్చట తీర్చుకోవడంతో పాటు అభిమానులకు కొంత కొత్తదనాన్ని పరిచయం చేస్తారు. అలా కాకుండా సినిమాలో అధిక శాతం అదే గెటప్ లో కనిపించాల్సి వస్తే. జనం రిసీవ్ చేసుకుంటారా. ఇమేజ్ కి ఏమైనా భంగం కలిగితే. ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. అలా ఆలోచిస్తే ఆయన లోకనాయకుడు ఎందుకు అవుతాడు. కమల్ హాసన్ అనే వర్సటైల్ యాక్టర్ ప్రపంచానికి ఎలా తెలుస్తాడు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చేసిన ఓ మహత్తర ప్రయత్నమే ‘అవ్వై షణ్ముగి’ అలియాస్ భామనే సత్యభామనే

Also Read: కొత్త గ్రామర్ నేర్పించిన పసివాడు – Nostalgia

1996లో శంకర్ దర్శకత్వంలో తను చేసిన ‘భారతీయుడు’లోని పండు ముసలి క్యారెక్టర్ కమల్ హాసన్ లో ఎన్నో ఆలోచనలు రేపింది. వాళ్ళను మెప్పించే కథా కథనాలు ఉంటే తమ హీరో ఎలా ఉన్నా ప్రేక్షకులు మెచ్చుకుంటారని అర్థమైపోయింది. అప్పుడు పురుడుపోసుకున్న అలోచనే అవ్వై షణ్ముగి. 1993లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘మిసెస్ డౌట్ ఫైర్’ని ఆధారంగా చేసుకుని క్రేజీ మోహన్ ఇచ్చిన కథ ఆధారంగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించేందుకు రంగం సిద్ధమయ్యింది. హీరోయిన్ గా మీనాను ఎంపిక చేసుకోగా ఆవిడ తండ్రి పాత్రకు తొలుత శివాజీ గణేషన్ అనుకుని ఆరోగ్య కారణాల వల్ల అది కాస్తా జెమిని గణేశన్ ని వరించింది

Also Read: తడబడిన లవ్ ఎంటర్ టైనర్ – Nostalgia

సెకండ్ హీరోయిన్ గా హీరా ఫిక్స్ అయ్యింది. ఫ్యాన్స్ ఏఆర్ రెహమాన్ ని ఆశించినప్పటికీ బడ్జెట్ ప్లస్ సమయం దృష్ట్యా సంగీత దర్శకుడిగా ఆ అవకాశం దేవాకు దక్కింది. కలతల వల్ల భార్య నుంచి విడిపోయిన ఒక భర్త తన చిన్నారి కూతురి కోసం ఆడ వేషం వేసుకుని అదే ఇంట్లో ఆయాగా పనికి చేరడమనే పాయింట్ ని రవికుమార్ చూపించిన తీరు అన్ని వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బొద్దుగా ఉండే బామ్మ వేషంలో కమల్ నటన నభూతో నభవిష్యత్తు. తెలుగులో 1997లో భామనే సత్యభామనే టైటిల్ తో ఎస్పి బాలసుబ్రమణ్యం డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయగా అదే సంవత్సరం హిందీలో కమల్ తన స్వీయ దర్శకత్వంలో ‘చాచి 42’0గా పునఃనిర్మించారు. తనకు రంగస్థల గురువైన అవ్వై టికె షణ్ముగంకు గుర్తుగా కమల్ సినిమాలో తన పాత్రకు ఆ పేరు పెట్టుకోవడం విశేషం

Also Read: ఒక్క మగాడుని ఎందుకు తిరస్కరించారు – Nostalgia